పుట:బ్రిటిష్ రాజ్యతంత్రయుగము అను బ్రిటిష్ ఇండియా చరిత్ర దిగవల్లి వేంకటశివరావు.pdf/379

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

వందేమాతరం

355


గట్టిగా కోరసాగెను. 1895 లో భారతదేశములోనికి దిగుమతియగు ఇంగ్లీషు బట్టలపైన సుంకములు విధింపబడగా పార్లమెంటులో ల్యాంకషైరు సభ్యు లతితీవ్రముగా ఆక్షేపించిరి. భారతదేశముయొక్క వ్యవహారములు ప్రభుత్వ వ్యయ విథానమునుగూర్చి విచారించుటకుసు ఒక కమిటీ యేర్పడెను. విశ్వవిద్యాలయములందు చదువుకొనిన విద్యాధికులు రాజకీయార్థిక వ్యవహారములందెల్ల భారతదేశమునకు జరుగుచున్న అన్యాయములను గమనించి చర్చింపసాగిరి. అందువల్ల రాజకీయ పరిజ్ఞానము దేశములో క్రమక్రమముగా వృద్ధియగుచు దేశపరిపాలనమునుగూర్చిన ఆలోచనలు ప్రజలలో వృద్ధియగుటయు ప్రభుత్వచర్యలు తీవ్రముగా విమర్శించుటయు ప్రారంభమయ్యెను.

1893 లో బొంబాయిలో హిందూ ముసల్మానుల కొట్లాట మఱల జరిగెను. అంతట మహారాష్ట్రమునందు హిందువులలో గొప్ప మతాభిమానము కలిగి భజనలతోను, కీర్తనలతోను గణపతి యుత్సవములు ప్రారంభించి ఉద్రేకము పొందసాగిరి. ఈ ఉత్సవములే దేశభక్తిని బోధించు సాధనములుగా జాతీయనాయకులవలన ఉపయోగింపబడెను. దేశములోని యువకులలో వ్యాయామక్రీడలు పురికొల్పబడెను. "చాపే కారుల"ను చిత్పావనబ్రాహ్మణులు పూనాలో యువకులకు సైనికశిక్షణము నిచ్చి తర్ఫీదుచేయుట కొక సంఘము స్థాపించి శివాజీ యుత్సవములు ప్రారంభించిరి. పురాణకథలు దేశభక్తి పూరితములగు ఉపన్యాసములుగా చేయబడసాగెను. దేశ