పుట:బ్రిటిష్ రాజ్యతంత్రయుగము అను బ్రిటిష్ ఇండియా చరిత్ర దిగవల్లి వేంకటశివరావు.pdf/376

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

352

బ్రిటిష్ రాజ్యతంత్రయుగము

ఏది యెట్లున్నను 1882 వ సంవత్సరము భారతదేశ జాతీయచైతన్య చరిత్రలో చాల ప్రాముఖ్యత జెందిన వత్సరమనక తప్పదు. భారతదేశ సందేశమును పాశ్చాత్యుల కందజేసిన వివేకానందస్వామి యీ సంవత్సరముననే శ్రీరామకృష్ణ పరమహంసయొక్క శిష్యుడయ్యెను. భారతదేశములోని ప్రతిభాశాలురను విద్వాంసులను రాజ్యనీతిజ్ఞులను సంస్కర్తలను ఒక్క ముఖమునకు తెచ్చిన సంస్థలలో ప్రధానమైనదగు దివ్యజ్ఞానసమాజ కార్యస్థానము అడయారులో స్థాపించుటకు నిశ్చయింపబడినదియు ఆ సంవత్సరముననే. నాడుమొదలు భారతదేశోద్ధరణకు తోడ్పడిన శక్తులెల్ల కేంద్రీకృతము కాజొచ్చెను. అట కలకత్తాలోను బొంబాయి సిమ్లాలలోను మద్రాసులోను జాతీయభావములు పెంపొందెను .

భారతదేశ జాతీయోద్యమమును గూర్చి అనీబిసెంటుగారు వ్రాసిన పుస్తకము వలన నొక విశేషము తెలియుచున్నది. 1884 లో దివ్యజ్ఞాన సమాజ 'కన్వెన్షను' వార్షికోత్సవమునకు దేశములో నలుప్రక్కలనుండి మద్రాసుకు వచ్చిన ప్రముఖులలో 17 మంది ప్రత్యేకముగా సమావేశమై అఖలభారతజాతీయ ప్రతినిధుల సభ నొక దానిని స్థాపింప నిశ్చయించిరనియు నిదియే కాంగ్రెస్ మహాసభ స్థాపనకు కారణమయ్యె ననియు ఆమె వ్రాసినది.[1]

  1. How India wrought for Freedom. - Annie Besant.