Jump to content

పుట:బ్రిటిష్ రాజ్యతంత్రయుగము అను బ్రిటిష్ ఇండియా చరిత్ర దిగవల్లి వేంకటశివరావు.pdf/375

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

జాతీయ చైతన్యము

351


దగినవారు. వీరిరువురు 1931 లో సమాజసభ్యులై సిమ్లాలో నొకశాఖను స్థాపించిరి. సిన్నెటుగారు పయోనీరుపత్రికకు సంపాదకులు. వీరు భారతదేశీయుల పక్షమున వ్యాసములు వ్రాయుట చూచి పత్రిక యజమానులగు ఆంగ్లేయులకు కోపమువచ్చి ఈయనను పనినుండి తొలగించిరి. హ్యూముగారును సిన్నెటుగారును భారతదేశముపట్ల నత్యంతాభిమానము కలిగియుండుటకు దివ్యజ్ఞానసమాజమే కారణమనియు వీరు తల్లాప్రగడ సుబ్బారావుగారికి శిష్యులుగ నుండిరనియు సమాజ పుస్తకములందు వ్రాయబడినది. (బ్లావెట్‌స్కీ లేఖలు)

దివ్యజ్ఞానసమాజము భారతదేశమునకు చేసినసేవ నిరుపమానమైనది. భారత దేశోద్ధరణకు తన జీవితమెల్ల ధారవోసిన అనిబిసెంటుగారు నీ సమాజసభ్యురాలైన తరువాతనే భారతదేశముపట్ల గాఢమైన అభిమానము కలిగియుండెను. ఈమె ఇంగ్లండులో నుండగా 1878 లో 'భారతదేశము - ఆఫ్‌గనిస్థానము - బ్రిటిష్ ప్రభుత్వము,” అనునొక ఉద్గ్రంథమును వ్రాసి భారతదేశ వ్యవహారములను తీవ్రముగా విమర్శించి యుండెను. తరువాత నామె యీదేశమునకు వచ్చి ఈదేశము పట్ల నెంతో భక్తి కలిగి ఎన్నో గ్రంథములను రచించి ప్రబోధము కలిగించెను. 1916-18 మధ్య హోంరూలు ఉద్యమమును నడిపి భారతదేశ స్వాతంత్యము కొరకు విశేష కృషిచేసెను. ఈ దేశముకొరకీమె యెన్నో బాధలనుభవించెను. ఈమె కాంగ్రెస్‌కు అధ్యక్షురాలై సమర్ధతతో నడిపెను.