ఇంగ్లీషు చదువులు
279
కేవలము చౌకబారు నౌకరులను తయారు జేసి దేశ దాస్యమును చిరస్థాయిచేయుటకే ఈ యాంగ్లేయచదువులు ప్రారంభింప బడినవి. నాడు సంస్కృతవిద్యావిధానాభిమాని యగు హెచ్. హెచ్. మన్సుగారు మున్నగువా రీ యన్యాయమును జూచి వగచినను లాభములేకపోయినది. "నేటివు" భారతీయు లందు విద్యావ్యాప్తిజేయుటకుగల ముఖ్యకారణములలో నొకటి, ప్రభుత్వోద్యోగములందు వారినినియమించు అవసరము కలుగుటయని బొంబాయి గవర్నరుగ నుండిన సర్ జా౯ మాల్కలంగారు 1828లో స్పష్టముగా జెప్పియేయున్నారు. 'దీనివలన ఖర్చుతగ్గును. కొంత దేశాభివృద్ధికలుగును. బ్రిటిషుపరిపాలన గట్టిపడు' ననియు చెప్పినాడు. 1854లో కంపెనీ పరిపాలకులు విద్యావిధానమునుగూర్చి జారీచేసిన 'ఎడ్యుకేషనల్ డెస్పాచి' అనబడు తాఖీదులో గూడ ఈ విద్యాభివృద్ధి, ప్రభుత్వమువారి నౌకరీలోనుండు ఉద్యోగుల శక్తిసామర్థ్యములను తెలివితేటలను హెచ్చించునని వ్రాసియుండిరి. మాల్కలంగారు వ్రాసిన మినిట్సులో నేటివులలో విద్యనేర్చినవారు తక్కువగ నున్నందున హెచ్చుజీతములు ఇవ్వవలసి వచ్చుచున్న దనియు విద్యాభివృద్ధి చేసినచో ఉద్యోగముల కొఱకు ప్రాకులాడువారి సంఖ్య హెచ్చుననియు అందువలన జీతములుతగ్గించ వచ్చుననియు సెలవిచ్చిరి! ఇట్లు విశ్వాసపాత్రులగు చౌకబారు నేటివు నౌకరులను సృజించుటయే ఈ విద్యావిధానము స్థాపించినవారి యొక్క ప్రధానోద్దేశముగ నుండెను. ( Rise of Christian Power in India-Basu. )