పుట:బ్రిటిష్ రాజ్యతంత్రయుగము అను బ్రిటిష్ ఇండియా చరిత్ర దిగవల్లి వేంకటశివరావు.pdf/292

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

268

బ్రిటిష్ రాజ్యతంత్రయుగము


నిండ తినుటకుకూడ చాలదయ్యెను. ఒక్కొకప్పుడు యజమానులు వారిని కాళ్లుచేతులుకట్టివేసి కంపెనీవారికి ఉప్పుతయారు చేయగలందులకు “సుందర్భ౯న్” మొదలగు అనారోగ్యపు ప్రదేశములకుపంపి నిర్బంధసేవ చేయించుటగూడ జరుగుచుండెను. 1793 లో కోర్టులు స్థాపింపబడిన పిదప నీయన్యాయములు చాలవరకు తగ్గినవిగాని తెల్లవారి నిరంకుశత్వముగాని హింసలుగాని పూర్తిగారూపుమాయలేదు. సివిలుకోర్టుల తీర్పులును చిన్న ఫౌజుదారీ క్రిమినలు కేసులలో మేజిస్ట్రీటులు వేయు శిక్షలును తెల్లవారికి కొంచెము జంకుకలిగించినను, నల్లవారికి తమ బాధలను కలెక్టర్లతో చెప్పుకొను ధైర్యము లేనందున సాధారణముగా నెట్టి ఫిర్యాదును చేయకయె వారు బాధలనుభవించుచుండిరి. (రమేశచంద్రదత్తుగారి ఆర్థికచరిత్ర.)

జిల్లాలో పరి పాలనాధికారమును న్యాయ విచారణాధికారమును ప్రధమమునుండియు కలెక్టరులే చలాయించు చున్నందున చాలా అన్యాయములకు కారణములయ్యెను. కలెక్టరు కేవలము ప్రభుత్వము యొక్క రివిన్యూ వ్యవహారములు చక్కబెట్టుటకు నియమింపబడిన అధికారిగా నుండి ప్రజల కష్టసుఖములు గమనించి న్యాయవిచారణ విషయమై తగు శ్రద్దవహింపడయ్యెను. 1793 లో నీరెండు అధికారములును వంగరాష్ట్రములో కారన్ వాలిసు విడదీసి వేరు వేరు ఉద్యోగులకిచ్చినాడు. దీనివలన న్యాయవిచారణాధికారులు, తమ యధికారము క్రిందనుండిన ప్రజల క్షేమమునుగూర్చి కొంతజాగ్రత్తగా యోజించి న్యాయపరిపాలన చేయసాగిరి. ఇతరచోట్ల నిది జరుగలేదు.