సివిల్ క్రిమినల్ న్యాయవిచారణ
267
యముచేయుటకు క్రొత్తగా ఇద్దరు ఆంగ్లేయపోలీసు సూపరెంటెండెంట్లను నియమించిరి. ప్రత్యేకాధికారములతో క్రొత్త మేజస్ట్రీటులనుగూడ నియమించిరి. ఈయధికారులు తమ పనిని చలాయించుటలో తమకు తోడ్పడుటకు కొంతమంది ('గుండా' లను) ఆతతాయిలను, రహస్యపరిశోధనకు మఱికొందరిని,నియమించిరి. ఈ పొగరుబోతులు పశుబలమును ప్రయోగింపసాగిరి. అనుమానమున్నను లేకున్నను, తమ విరోధులపైన నేరములు మోపుటయు, అన్యాయముల చేయుటయు మొదలిడిరి. ఇదియే రహస్య పోలీసుశాఖకు పునాదియైనది. అబద్దపు ఫిర్యాదులు కొండెములు చెప్పి నిరపరాధులనుగూడ చాలకాలమువరకు జైళ్ళలో పడవేయించుచుండిరి. నిందితులు విచారణకు పెట్ట బడునప్పటికి కొన్ని నెలలుపట్టి ఒక్కొక్కప్పుడు కొన్నిసంవత్సరములుకూడ జైళ్ళలో పడియుండుటవలన జైళ్ళు క్రిక్కిరిసి యుండెను. మేజస్ట్రీటులను జూచినదానికన్న ఈ రౌడీలను కొండెగాండ్రనుజూచి ప్రజలు ఎక్కువగా భయపడుచుండిరి.
ఎన్నిలోపములున్నను న్యాయవిచారణచేయు కోర్టు లనునవి వచ్చినతరువాతనే వంగరాష్ట్రములోను తక్కిన రాజధానులలోను ఆంగ్లేయవర్తకుల ఆగడములు కొంతవరకు చల్లారినవి. అంతకుపూర్వము వర్తకమెల్ల వారి చేతిలోనుండి కంపెనీక్రింద పనిచేయునల్ల నౌకరులను, ఇతర ఆంగ్లేయవర్తకులక్రింద పనిచేయు నౌకరులను దొరలు కొట్టుట, హింసించుట, నిర్బంధించియుంచుట సర్వసామాన్యముగానుండెను. వేలకొలదిమంది వెట్టిచాకిరి చేయవలసివచ్చుచుండెను. వారికిచ్చుస్వల్పకూలి కడుపు