Jump to content

పుట:బ్రిటిష్ రాజ్యతంత్రయుగము అను బ్రిటిష్ ఇండియా చరిత్ర దిగవల్లి వేంకటశివరావు.pdf/236

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

212

బ్రిటిష్ రాజ్యతంత్రయుగము


ఒక్కడైనను స్వేచ్చగలేడు. అశక్తదుర్జనత్వముగల నారాయణసింగు పారిపోవగా వానిని సైతము పట్టుకొని బంధించితిని."

1 వ డిశంబరు 1850:

“అయిదేండ్లకు ముందు అమృతసరపు వీధులలో ఐరోపీయుడు నిలుచుటకు భయపడుచుండెను. ఈ రోజున వారి కోరికపైననే వారి పవిత్రస్థలమున, గ్రంథ సాహేబు సన్నిధిలో నొక ఇంగ్లీషు గవర్నరుజనరలు నిలిచినాడు. సాహసులును, హంతకులును, మతావేశులునగు అకాలీలే అతని యెదుట సాగిలిపడి మ్రొక్కిరి. అయినను పంజాబుపరిపాలన బాగుగలేదని సర్ చార్లెసు నేపియ రనుచున్నాడు!"

30 వ జూలై 1851:

“ఈమారు నైజామును చాల బాగుగా బెదిరించి హడల గొట్టితిని. ఈమారు క్రిష్టమసు పండుగకుముందు ఎనిమిది లక్షల పౌనులను క్రక్కునని నా ధైర్యము."

1 వ ఫిబ్రవరి 1852:

"ఈమారు ఢిల్లీలోకూడా నా పంతము నెగ్గినది. వారసత్వము అంగీకరించెదనని చిన్న రాజకుమారునికిచెప్పి నా మాటలు వినునట్లుచేసి నాకు గావలసినదెల్ల తెచ్చితిని. ఇతరుల చేతులలోనున్న యెడల మనకు చాల భయంకరమును, మన చేతులలోనున్న యెడల మన కత్యంతోపయుక్తమగు నాయుధాగారమును కాగల ఢిల్లీలోని గట్టికోటనుకూడ సంపాదించితిని. ఆ కోటయొక్క వెలుపలిప్రక్కగోడ చాలగట్టిది. వాని రాజు నగరుతో పాటు కిరీటమునుగూడ తీసికొనవలెనని నాకున్నది.