పుట:బ్రిటిష్ రాజ్యతంత్రయుగము అను బ్రిటిష్ ఇండియా చరిత్ర దిగవల్లి వేంకటశివరావు.pdf/233

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఆంగ్ల గవర్నరుజనరలుల దొరతనము

209


పోయినవి. నిరంకుశులగు ప్రాతఅధికారులవంటి వారే మరల పరిపాలనకువచ్చిరి. అంతట పూర్వపద్ధతులతోనే రాజ్యాక్రమణలకొరకు కుతంత్రములు, అక్రమయుద్దములు చేయబడి, ఎంతో సొమ్ముఖర్చుపెట్టబడి, ప్రజలకు బాధకలిగించి, సింధు పంజాబు బర్మాలు కలుపుకొనబడినవి. డల్‌హౌసీ ప్రభువు 1848లో గవర్నరుజనరలు కాగానే ఈనిరంకుశత్వము రాజ్యాక్రమణము మితిమీరి ఇంకను చిత్రమైనపద్దతు లవలంబింపబడినవి. ఇంతవరకును బ్రిటిషువారిపట్ల భక్తివిశ్వాసములు కలిగియున్న నవాబులును రాజులునుగూడ పదభ్రష్టులుగా చేయబడి కూలద్రోయ బడసాగిరి. నాగపురము అయోధ్యయు కలుపుకొనబడెను, భా౯స్లే రాజు మరణింపగా నతని దత్తపుత్రుడు నాగపుర సింహాసనమెక్కెను. అయితే అతని దత్తత నంగీకరింపక డల్‌హౌసీ ఆతనిని బంధించి రాణివాసములోని నవరత్న ఖచితములగు నగలనెల్లవశముచేసికొని బహిరంగముగా వేలము వేయించి రాజ్యమునుగూడ లాగికొనెను. ఝాన్సీరాజు 1853లో మరణింపగా, అతనికిని అతనివారసులకును దత్తపుత్రులకును వారి సంతతికినికూడ రాజ్యాధికారముండునట్లు పూర్వము చేసికొనిన ఒడంబడికకు భంగకరముగా డల్‌హౌసీ ప్రవర్తించెను. సైనిక వ్యయములక్రింద బీరారును నైజామువల్ల పుచ్చుకొనెను. ఇంతటితో తృప్తిజెందక నవాబులకు చూపవలసిన గౌరవ మర్యాదలనుగూడ ఇతడు తీసివేసెను.