పుట:బ్రిటిష్ రాజ్యతంత్రయుగము అను బ్రిటిష్ ఇండియా చరిత్ర దిగవల్లి వేంకటశివరావు.pdf/213

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

దొరల వడ్డీ వ్యాపారము

189


మొత్తము అప్పారావుగారికి బదులిచ్చి ఋణపత్రము వ్రాయించుకొంటిననియు హడ్జెన్ బనాయించెను. హడ్జెన్ పేర అప్పారావుగారు పత్రమువ్రాసినట్లు చెప్పు తేదీన అప్పారావుగారు బందిఖానాలో బైదీగా నుండిరి. ఆయన కారాగారాధికారి యీహడ్జెన్ దొరయే! ఈ బాకీ యెంత నమ్మతగినదో యూహింపుడు. ఈ హడ్జెన్ తనను బలవంతముజేసి ఒక ఋణపత్రమును వ్రాయించుకొనెనని ఇంకొక జమీందారు 1785 లో ఫిర్యాదు జేసియుండెను. ఈ హడ్జెన్ 1794 లో చనిపోయినాడు. అతని భార్య 1801 వరకు నీబాకీమాట ఎత్తలేదు. ఆసంవత్సరమున నామె ఒక అర్జీ యిచ్చుకున్నది గాని ఆ తన బాకీ యిప్పించవలసినదని కంపెనీ డైరెక్టర్ల కోర్టువారికి -ఆర్జీని వారు త్రోసివేసిరి. 1803లో శాశ్వతపైసలా (పర్మనెంటుసెటిల్మెంటు) సందర్భమున నూజివీడు జమీందారీ భూములకు అప్పారావుగారి కుటుంబమువారికి ఇంగ్లీషు ప్రభుత్వమువారు సన్నదునిచ్చిరి. అప్పుడెట్టి షరతులును నిర్ణయింవ బడలేదు. ఇట్లు రమారమి ముప్పది సంవత్సరములు గడచిపోయినవి. అంతట నీ బాకీని ఇప్పించవలసినదని కొందరు దొరల మద్దతుతో మరల నొక ప్రయత్నము జరిగెను. ఈ బాకి అబద్దమనియు చెల్లదనియు కంపెనీవారు ఎదిరించిరి గాని 1832 లో నింగ్లీషు ప్రభువుల సభవారీబాకీ యివ్వవలసినదే యని తీర్మానించిరి. ఇట్లు తెల్లదొరల అధికారబలమును పలుకుబడియు జయము పొందెను. [1]

  1. ( Thornton-History of British Empire in India. Vol. II P. 243)