166
బ్రిటిష్ రాజ్యతంత్రయుగము
IV
క్లైవు తరువాత స్థితిగతులు
1769 లో క్లైవు కడపటిసారి మన దేశము వదలిపోయెను. వంగరాష్ట్రముయొక్క సత్పరిపాలనను గూర్చినచింత క్లైవు కెన్నడునులేదు. నవాబుయొక్కయు అతని ప్రజలయొక్కయు బలహీనతను పురస్కరించుకొని కంపెనీవారి రాజకీయాధిపత్యము నేదోవిధముగా నిలువబెట్టవలెననియే అతని యూహ. క్లైవున కేకోశమునను నీతి నియమము లనునవి లేవు. ఒక వంక కంపెనీసేవకులలో లంచగొండితనము మాన్పవలెననియు వారి జీతములు హెచ్చింపవలెననియుసీమకువ్రాయుచు 1765 వ సంవత్సరము సెప్టెంబరు 15 వ తేదీననే ఉప్పు, పోకచెక్కలు, పొగాకులో స్వంతలాభము కొఱకు నాటువ్యాపారము చేయుటకు కొందఱు కంపెనీ సేవకులతో తాను భాగస్వామిగానొక వ్యాపార కాగితము వ్రాయుటయే గాక, ఈ భాగస్వాములను కంపెనీ డైరెక్టరు లంగీకరింపక పోయినను, వంగరాష్ట్ర కౌన్సిలు అధ్యక్షుడుగా తా నీ వ్యాపారమును స్వేచ్ఛగా జరపనిచ్చెదనని అందులో నొక షరతుగూడా చేర్చెను. తరువాత దీనినిగూర్చి అతనిపైన నేరము మోపగా తనను నమ్ముకొని వంగరాష్ట్రమునకు వచ్చిన స్నేహితుల లాభముకొఱకు, తా నిట్లు చేసితినని తప్పించుకొనజూచెను. ఈ వ్యవహారము సిగ్గు బిడియములేని అన్యాయపు పనియని మిల్లు తన చరిత్రలో వ్రాసినాడు.