క్లైవు చూపినదారి
165
ఒరిస్సా పరగణాలలోని భూములపైనను వాని శిస్తు వసూలు పైనను తనిఖీ అధికారము. మన సైన్యము ధనము మొగలు చక్రవర్తికి సహాయపడినందుకు ప్రతిఫలముగా నత డీ యధికారమును మన కిచ్చుట కంగీకరించినాడు. ఈ వ్యవహారము అతి జాగ్రత్తతో నిర్వహింపబడినది. ఈ దేశముల ఆదాయములనుండి నవాబుయొక్క అధికారము, గౌరవము నిలువబెట్టి యుంచుటకు గావలసిన (అలవెన్సు) సొమ్మును మొగలు చక్రవర్తి కివ్వవలసిన కప్పమును సక్రమముగా చెల్లింపవలెను. మిగిలినది మన కంపెనీకి చెందును. ఈయధికార ప్రాప్తివలన బర్డువాను మొదలగు ప్రాతజాగీరులపైన కలిసి తమ రివిన్యూ ఆదాయము సాలుకు 250 లక్షల సిక్కా రూపాయిలకు తక్కువయుండదు. ఇకముం దింకను ఇరువది ముప్పది లక్ష లధికము కాగలదు. మీసివిలు మిలిటరీ వ్యయము లన్నియుకలసి సామాన్యముగా సాలుకు 60 లక్షలరూపాయిలు దాటవు. నవాబు కివ్వవలసినసొమ్ము ఇప్పుడు 42 లక్షలకు తగ్గించివేయబడినది. చక్రవర్తికి కప్పముక్రింద సాలుకు 26 లక్షలు పోగా మనకు ప్రతిసాలున 122 లక్షల రూపాయిలు నికరలాభము మిగులుచుండును." అని క్లైవు డైరక్టరులకు వ్రాసినాడు. ఇదియంతయు 1765 సెప్టెంబరు 30వ తేదీన వ్రాసిన లేఖలోకలదు. కంపెనీ నౌకరుల జీతములు హెచ్చుచేసి స్వంతవ్యాపారమును నిషేధింపవలెనని క్లైవు సలహా యిచ్చినాడు.