పుట:బ్రిటిష్ రాజ్యతంత్రయుగము అను బ్రిటిష్ ఇండియా చరిత్ర దిగవల్లి వేంకటశివరావు.pdf/131

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

బ్రిటిష్ రాజ్యతంత్రయుగము

107


II

భారతదేశ స్వాతంత్ర్యము కొరకు జరిగిన సిపాయిల విప్లవము వలన భారతదేశ ప్రజలపైన నాంగ్లేయులకు తీవ్రమైన కోపము కలిగెను. ఈ జాతి వైషమ్యము వలన భారతీయుల నాంగ్లేయు లెన్నడు నమ్మరాదనియు సమయము వచ్చినచో నీ దేశీయులు తెల్లవారిపైన తిరుగబడి తీరుదురనియు వీరిని శాశ్వతముగా నణచియుంచి నిరంకుశముగా పరిపాలింపవలె ననియు నొక రాజ్యనీతి సూత్రము స్థాపితమై తరువాత నీదేశ పరిపాలనములో నన్నివిషయములందు నది ప్రతిఫలింపసాగెను. ప్రభుత్వ వ్యవహారము లన్నియు నాంగ్లేయుల వశమున నుండవలెననియు ప్రభుత్వశాఖలలోని అన్ని ముఖ్యోద్యోగములు తెల్లవారి చేతులలో నుండవలెననియు నిశ్చయింపబడెను.

సిపాయిల విప్లవము వలన భారత దేశమునందలి ఆంగ్లేయోద్యోగుల కులతత్వము వర్ధిల్లెను. ఆంగ్లేయులు తమదేశము విడచి ఈదూరదేశమున తమ ఆలు బిడ్డలతో నెన్నోకష్టములు పడిజీవించుట యొక త్యాగమనియు నిందుకు తమకు హెచ్చు ప్రతిఫలము రావలెననియు నొకసూత్రము స్థాపింపబడెను. జీతములు హెచ్చుచేయబడెను. ఈ ఆంగ్లేయోద్యోగు లెల్లరును భారతీయులలో హిందూసంఘములోని అగ్రకులజుల కన్నను గూడ కులాభిమానము గలిగి జాత్యహంకారముతో ప్రవర్తింపసాగిరి. ఈతెల్లనల్ల సమస్య యింకొక రూపముదాల్చెను. ఆంగ్లేయులకును భారతీయ స్త్రీలకును పుట్టిన యూరేషియను