108
భారత దేశమున
సంకరజాతివారు సిపాయిల విప్లవమున తెల్లవారితో జేరి భారతీయులకు వ్యతిరేకముగా పోరాడి యుండిరి. అందువలన నీ యూరేషియనులకు కూడా కొన్ని ప్రత్యేక హక్కులు ప్రసాదింపబడు పద్ధతి ప్రారంభమయ్యెను.
సిపాయిల విప్లవానంతరము ఇంగ్లీషు ప్రభుత్వమునకును భారతదేశమునందలి సామంతరాజులకునుగల సంబంధములందు వచ్చిన మార్పు లింకొక చోట వర్ణింపబడినవి. ఇట్లే భారత దేశపరిపాలన విధానమునందుకూడా కొన్నిమార్పులు జరిగెను. విధానమునందేకాదు, దృక్పథమునందుకూడా కొన్నిమార్పులు జరిగెను. సిపాయిల విప్లవమువలన ఆంగ్లప్రభుత్వము విచ్చిన్నము కాలేదు. ఒకమూల నీవిప్లవము జరుగుచున్ననుతక్కిన చోటుల సామాన్యపరిపాలన జరుగుచునేయుండెను. దక్షిణాపథమున కదలికయే లేదు. ఉత్తరమునగూడ లక్నో శత్రువుల చేతులలో నున్నప్పుడుకూడా డెక్కు బంగాళాలలో మేజా బల్లలపైన గుడ్డలు సరిగా లేవని కొంద రాంగ్లేయులు సణుగు చుండిరట!
సిపాయిల విప్లవ మంత ఆకస్మికముగా వచ్చుటకు గారణము ఆంగ్లేయ జిల్లాఅధికారులు ప్రజలతో కలసిమెలసి యుండక కళ్లుమూసికొని యుండుటయేయని ఆనాటి ఆంగ్లేయ రాజ్య నీతిజ్ఞులకు తోచెను. క్రొత్తగా ఆంగ్లేయ ప్రభుత్వము క్రిందికి వచ్చిన పంజాబులో సర్ జాన్ లారెన్సు బందోబస్తులు చేసి కట్టుదిట్టమైన పరిపాలనా పద్దతులు స్థాపించుటవలన నచ్చట నెట్టి విప్లవము లేక శాంతముగ నుండెనని తోచెను.