పుట:బారిష్టర్ పార్వతీశం.pdf/195

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

194

బారిష్టరు పార్వతీశం

సాధ్యమైనంత వరకు చేతితో తాకకుండానే చెయ్యవలెనని వాళ్ళుద్దేశ్యం. సరే, ఎలాగో ఆపూటకు వంట అయిందనిపించి ఆ వంటకాలు మీరు కూడా రుచి చూడండని పప్పు, కూరా, పులుసూ, వాళ్ళకూ కూడా కొంచెం యిచ్చి నాగదిలో సాపాటు నే చేశాను. తరువాత క్రమేణా ఆవిడే ఏదో ఓ రకంగా చేసి పెట్టడం నేర్చుకుంది. “మన పప్పు చాలా

బాగుంటుందన్నది. పులుసు కూడా బాగానే ఉంది కానీ ఆ కారం మేము తినలేమంది. తరువాత అంత చింతపండు కూడా ఇక్కడ తినడం మంచిది కాదంది. కావలిస్తే మాకు మల్లేనే పల్చగా సూపు చేసుకుని అందులో కొంచెం నిమ్మరసం వేసుకోవచ్చు నంది. ఆ సలహా బాగానే ఉందనుకున్నాను. కొన్నాళ్లు ఎలాగో యిలా తంటాలు పడ్డా మనం అన్ని రుచులకూ అలవాటు పడ్డ వాళ్ళం కనుక మన ఊరగాయల మీదికి దృష్టి పోయింది. మా రాజుని సలహా అడిగేను దీనికి ఏదన్నా ఉపాయం చెప్పమని. నేను అప్పుడప్పుడు ఇంటికి రాసి తెప్పించు కుంటుంటాను. ఈ వేళో రేపో రావాలి. రాగానే మీకు కొంత వాటా ఇస్తాను అన్నాడు.