పుట:బారిష్టర్ పార్వతీశం.pdf/194

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

మొక్కపాటి నరసింహశాస్త్రి

193

వేయలేదు. కడుపు మండుతుంటే యేంజేయను అదే యెలాగోమింగేను.

ఆ సాయంత్రం టీ తీసుకుంటుండగా రాజు వచ్చాడు, ఏమండి మీ సంసారం యెలాగుంది అన్నాడు నవ్వుతూ “కొత్తకాపురం” కదండీ ఇంటి ఆవిడకు అన్నీ మొదట నుంచి క్రమేణా చెప్పాలి అన్నాను. “అన్నీ వద్దులెండి వంటవరకూ చెప్పుతే చాలు” అన్నాడు రాజు. కాసేపు బైటికి వెళ్ళి కాలేజి ఉన్న చోట చూసి దగ్గిర్లోనే ఒక పార్కుంటే అందులో వెళ్ళి కూర్చున్నాం. కబుర్ల మధ్యను. “మీ చదువు విషయమేమి”టన్నాడు. “మీసలహా ఏమి”టని నే నేదురడిగాను. “మీకు ఇంగ్లీషు భాషాజ్ఞానం బొత్తిగా తక్కువగా ఉన్నది కనుక ఇక్కడ ముందు ఒక ప్రయివేటు మాష్టరుని పెట్టుకొని మూడు, నాల్గు మాసములు చదువుకొని వేసవి సెలవలు తరువాత, ఎంట్రెన్స్ పరీక్షని ఉంటుంది. దానికి కూర్చుని ప్యాసయితే వెంటనే M.A లో చేరవచ్చు. ఆతరువాత మీ ఓపికనుబట్టి “లా” పరీక్ష కూడా అనగా బారిష్టరు పరీక్ష కూడా చదవవచ్చు” అన్నాడు.

మర్నాడు మాయింటావిడకి వంటా - వార్పూ నేర్పడానికి ప్రయత్నం ప్రారంభించాను. నేను దగ్గిర కూర్చుని మన పద్ధతిలో వంట ఎలా ఉంటుందో తెలిసీ తెలియని విషయాలను, వచ్చీరాని భాషలో చెబుతూంటే ఆవిడా, కూతుళ్ళూ కూర్చుని, ఒక్కటే నవ్వుకోడం మొదలెట్టారు. నవ్వుతే వాళ్ళమూతే వంకరపోతుంది. నా కేమని నాపాఠం సాగించాను. అన్నం సరిగా అత్తెసరు పదునుగా వండడ మెలాగో నేర్పాను. ముద్ద పప్పు చెయ్యడ మెలాగో చేసి చూపించాను. అది మన గోదావరి జిల్లా వాళ్ళ జన్మహక్కు. తరువాత బంగాళా దుంపలకూర వండించాను. ఉడికిన తరువాత, పోపు వేద్దామని మిరపకాయలు తుంపి ఆవాలు అవీ జాగ్రత్త చేసుకొని చూసేటప్పటికి నూనె లేదు. “మరి నూనె లేకపోతే ఎలాగ” అన్నాను. ఇక్కడ కొవ్వేగాని మామూలు నూనెలు ఏవీ దొరకదండీ అంది. సరే! రేపటి సంగతి ఆలోచిద్దామని ఆ పూట కొంచెం వెన్న కాచి, సామెత చెప్పినట్టు అప్పుడు కాచిన నేతితో తిరగమోత వేయించాను. ఆ ఘాటుకి వాళ్లు తట్టుకోలేక, ఉక్కిరిబిక్కిరయ్యారు. తరువాత, పులుసు ముక్కలు ఉడక పెట్టి అందులోకి చింతపండు నీళ్లుపోసి, పిసుకుతుంటే వాళ్ళకు వింతగా కనబడింది. చేత్తోటి పిసక్కుండా చెంచాతో నొక్కి ఆ రసంతీసుకోకూడదా అని అడిగింది ఇంటావిడ. “తీసుకోవచ్చు కానీ పూర్తిగా అందులో రసం అలా తీయడం కష్టం ఇది సుళువైన మార్గం’’ అని చెప్పినా వాళ్ళకు అట్టే నచ్చలేదు. ఏదీ ముఖ్యంగా తినే వంటకా లేవీ