పుట:బారిష్టర్ పార్వతీశం.pdf/189

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

188

బారిష్టరు పార్వతీశం

ఇలా ఏవేవో వెర్రి ఆలోచనలతో సతమతమవుతుంటే, బాగా వెల్తురొచ్చింది. మా గది తలుపుమీద నెమ్మదిగా యెవరో కొట్టిన చప్పుడైంది. నేను ఈ దేశంలో వున్న సంగతి మరచిపోయి “ఆ వస్తున్నా” అనీ యింటి దగ్గర కేకేసినట్టు కేకేశాను. దాంతో రాజు ఉలిక్కిపడి లేచి, “ఏమండి ఏమిటి కలవరిస్తున్నారు” అన్నాడు నవ్వుతూ, “కలవరింత కాదండీ అవతల నుంచి యెవరో తలుపుకొట్టిన చప్పుడైతే అలవాటు చొప్పున వస్తున్నానని కేకవే శాను” మీకు నిద్రాభంగమైనట్టుంది అన్నాను. “మరేం ఫరవాలేదులేండి. ఏలాగూ తెల్లవారిందికదా. మనల్ని లేపడానికే ఇంటి ఆవిడ అలా తలుపు కొట్టింది. అదీ ఆవిడకు మామూలు, ఇపుడావిడేకాదు. ఇక్కడాచారమేమిటంటే ఇంట్లో వాళ్ళయినా, పరాయి వాళ్ళయినా తలుపు దబదబా బాదకుండా వేళ్ళతోటి నెమ్మదిగా టక్ టక్ మనీ రెండుసార్లు కొడతారు. మనం అప్పుడు “యస్” అని గాని, “కమిన్” అని గాని ఇంట్లో వాళ్ళ యితే అనాలి. పై వాళ్ళెవరైనా వచ్చారనుకుంటే “కమిన్ ప్లీజ్” అనాలి. దయచేసి లోపలికి రండి అన్నమాట. ప్రతిదానికి యెదుటివాళ్ళు పిన్నలైనా, పెద్దలైనా, వయస్సుతో నిమిత్తం లేకుండా అందర్నీ అన్నిటికి ప్లీజ్ అనీ థేంక్యూ అనీ అనడం యిక్కడమర్యాద. ఆ మాటతో వాళ్ళెంతో సంతోషిస్తారు. మనం చాలా మర్యాదస్తులంగా చెలామణీ అవుతాం” అని చెప్పి “లేవండి ముఖాలు కడుగుదాం” అన్నాడు.

నేను రాత్రి సరిగా చూడలేదు కాని రాజు ఓ వొదులైన చార్లషరాయి, అలాంటి చార్లదే ఓ కోటు తొడుక్కున్నాడు. ఇపుడు లేవడంతో పాదాల వరకూ ఉండే పెద్ద కోటొకటి తొడుక్కున్నాడు. దానికి బొత్తాములు లేవు. నడుముకు ఓ పట్టు కుచ్చులతాడు బిగించాడు. అది వింతగాతోచింది. అలా ఆశ్చర్యంతో చూస్తూంటే “దీన్ని డ్రెస్సింగ్ గౌను అంటారు. లోపల వేసుకున్న షరాయి. చొక్కాని “పైజామా” అంటారు. మనం సూటుతో రాత్రుళ్లు కూడా ఉంటే మనకంత సుఖంగానూ ఉండదు. పైగా అది నలిగిపోతుంది కూడాను. ఇక్కడ సూట్లు అస్తమానం తడపడానికి దానికి వీలుండదు. మనలాంటి వాళ్ళకు ఒకటో రెండో సూట్లు చలికాలానికీ, ఒకటి రెండు సూట్లు వేసవి కాలానికీ కుట్టించుకుంటే ఒకటి, రెండు సంవత్సరాలు గడపవచ్చు. ఇంటి దగ్గర ఉన్నంత సేపు రాత్రిగానీ, పగలుగాని ఈ పైజమాలు వేసుకుంటే మనం ఎలా కూర్చున్నా, ఎలా పడుకున్నా యిబ్బంది ఉండదు. సూట్లు ఊలువి, పైజామాలు నూలువి. మన యిష్ట మొచ్చినప్పుడు తడుపుకోవచ్చు. లేదా చాకలికి వేయవచ్చు. మీరు కూడా రెండు జతలు ఇలాంటివి కొనుక్కో