పుట:బారిష్టర్ పార్వతీశం.pdf/188

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

మొక్కపాటి నరసింహశాస్త్రి

187

విచిత్రమైన కలలొచ్చాయి. యెక్కడికెక్కడకో తేలిపోతున్నట్లనిపించింది. ఆకాశంలో పెద్ద చేపల్లాంటి వేవో యెగురుతున్నట్టు కనపడింది. నక్షత్రాలెంతో దగ్గరగా కనపడ్డాయి. యింకేవిటో వింతలు అనేకం కనబడ్డాయి. మెళుకువ వచ్చేటప్పటికి యేమీ లేదు. ఆ కనపడ్డవి లేకపోవడం సరికదా వాటిని గురించి ఎవరికైనా చెబుదామంటే జ్ఞాపకాలైనా మిగల్లేదు. ఇంటి దగ్గర అలవాటు చొప్పున బాగా పెందలాడే మెళుకువ వచ్చింది. రాజు గాఢనిద్రలో వున్నాడు లేపుదామా అనుకున్నాను. కానీ పడుకున్న వాడిని యిపుడు లేపి చేసేది మట్టుకు ఏమున్నదని లేపలేదు. కిటికీ దగ్గరకు వెళ్ళి బయటకు చూస్తే ఇంకా జన సంచారమేమీలేదు. చీకటిగానే వుంది. అందుకని నేను మళ్ళీ వచ్చి పడుకున్నాను. ఈ మాటు నిద్రరాలేదు. కాని ఏ వేవో ఊహలు కలలుగా అస్పష్టంగా తలలో తిరగడం మొదలెట్టినాయి. ఈ దేశమేమిటో, ఇక్కడ మనుష్యులేమిటో, వాళ్ళ ఆచారవ్యవహారము లేమిటో, యేమీ తెలుసుకోకుండా గుడ్డెద్దు చేనబడినట్టు ఏ ఆలోచనా లేకుండా బయలుదేరి చక్కా వచ్చాను. వచ్చి అప్పుడే వారం రోజులయినా ఇంత వరకేమీ అంతుపట్టలేదు. నేను కొత్త వాణ్నయినా, చిన్న వాడినయినా అంతా “సర్” అంటూ యెంతో గౌరవంగా మాట్లాడుతున్నారు.

ఇక్కడ పురుషులకంటే స్త్రీ జనం యెక్కడ చూసినా యెక్కువగా కనపడుతున్నారు. వాళ్ళకేమీ నదురూ, బెదురూ ఉన్నట్టు కనపడలేదు. నడివీధులంటా, షాపుల్లోనూ, రైళ్ళలోనూ, ఒళ్ళు విరుచుకొని అందరినీ, ఆ తోసుకు తిరగడం చూస్తే నాకు భయంగానూ, వింతగానూ వున్నది. రేపొద్దున నేను వీధిలో కెళ్ళినా, స్కూల్లో చేరినా, వీళ్లు కూడా అక్కడ తయారవుతారు కాబోలు, దూరాన్నించి చూస్తేనే కొంత బెదురుగానూ, కొంత సిగ్గుగానూ వుంటే, వాళ్ళస్తమానం మీదమీదకి వస్తే, క్లాసులో ఈ ప్రక్కనీ, ఆప్రక్కనీ, వీళ్ళే తయారవుతే, మేష్టర్లు చెప్పేది వినడమెలాగ? ఆ విన్నది తలలో నిలుపుకోవడమెలాగ! ఈ ఆడవాళ్ళతోటి యెలాగైనా కొంత చిక్కు వచ్చేటట్టు వున్నది. చూద్దాం ఏం జరుగుతుందో తినబోతూ రుచి అడగడమెందుకు? పైన భగవంతుడెలాగూ వున్నాడు. ఈ వేళయినా గది దొరుకుతుందో దొరకదో! లేకపోతేయెలాగ! రాజు నెత్తిన యెన్నాళ్లు కూర్చోవడం? అయినా దొరక్కేం చేస్తుంది. ఇంత పెద్ద పట్నంలో ఇన్ని భవంతుల్లో ఈ బ్రహ్మచారికి దొరక్కపోతుందా? యెటొచ్చీ బ్రహ్మచారులను తీసుకోమంటే తప్పు అయినా ఇక్కడేమీ అటువంటిబ్బంది వుంటుందనుకోను.