పుట:బారిష్టర్ పార్వతీశం.pdf/186

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

మొక్కపాటి నరసింహశాస్త్రి

185

విశేషంగా వచ్చి ఈ మలాన్నంతనీ శుభ్రంగా కడిగేసి అడుగుకు ఎక్కడికో తీసుకుపోతుంది. ఇది శీతల దేశం గనుక అంత త్వరగా దుర్గంధము పైకి రాదు. మొహమే కడుక్కోని వాళ్ళూ, రోజూ స్నానమే చెయ్యరన్నమాట వేరే చెప్పడమెందుకు? అన్నాడు. మరయితే మనమో అన్నాను. మీ కిష్టమైతే మీరూ మానేయవచ్చునన్నాడు. “అదేమిటండీ అలా అంటారు. నేను బ్రాహ్మణ్ణి, అందులోనూ వైదీకిని. సంధ్యా వందనాదులే కుదరక మానేస్తున్నందుకు విచారిస్తుంటే, స్నానం కూడా ఎలా మాననండీ” - అలా అయితే, ఇక్కడొక్క క్షణము ఉండనండోయి. మీరేమన్నాసరేపోనీ, ఒక మాటు దేశము చూశావనుకుని చక్కా పోతానుగాని యింత మరీ అనాచారముగా, అప్రాచ్యముగా ఉండడము నావల్ల కాదు సుమండీ. తరువాతను మీ యిష్టం” అన్నాను. “సరే లెండి. నా యిష్టా యిష్టాలతోటి, పనేమి ఉన్నదిగాని మిమ్మల్ని మానమని చెప్పలేదు. స్నానానికి వేడి నీళ్ళు కావాలంటే ఇంటి వారితోటి చెబితే వారు సప్లయి చేస్తారు. మరేమీ ఫరవాలేదు” అన్నాడు.

“ఇది ఒకందుకు మంచిదే” అని నేను “దంత ధావనానికీ కచికలూ, తాటాకులూ, తెచ్చుకోవడము మంచిదే అయిన దన్నమాట!” అన్నాను.

అతను తెల్లబోయి, ఏమిటి కచికలూ, తాటాకులూ, తెచ్చారా? ఇన్నాళ్ళూను. మనలో మనమాట. మరేమీ తీసుకురాలేదా? ఇక్కడ దేశాచారము అక్షరాలా పాటిస్తున్నారా యేమిటి కొంపతీసి అన్నాను. “అయితే మీరు వచ్చేటప్పుడు ఎవ్వరినీ సలహా అడగలేదా!” అన్నాడు.

“నాకు సలహా చెప్పదగ్గవారు ఉన్నారండీ మొగలి తుర్రులో, మీరు ఎరుగరా?” అన్నాను.

ఒక్కమాటు నా కేసి నిదానంగా చూసి, “అవునులెండి. ఆ మాటా నిజమే. ఆ మాత్రము వాళ్ళు అక్కడే కాదు. ఆ చుట్టు ప్రక్కల ఎక్కడావుండి వుండరు. సరే, పోనీలెండి చెయ్యడము మంచిపని చేశారు గాని, అవి పాడయిపోయే వస్తువులు కావు గనక జాగ్రత్తగా పెట్టుకోండి. వెళ్ళేటప్పుడూ ఉపయోగించుకుందురుగాని - మనము గదికి వెళ్ళేటప్పుడు మీకు దంతధావన సామాగ్రి, ఇక్కడ ఉపయోగించేవి కొని పెడతాను” అన్నాడు పాపం అతను.

తరువాత భోజనానికి మనము ఎక్కడకూ హోటలుకు వెళ్ళనక్కర లేదు. ఇంటివాళ్ళే మనకు ఏమి కావాలో చెబితే ఆ ప్రకారము చేసి పెడ