పుట:బారిష్టర్ పార్వతీశం.pdf/185

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

184

బారిష్టరు పార్వతీశం

లంగా మనం ప్రవర్తిస్తే మనకాట్టే యిబ్బందులు వుండవు. మొదటి సంగతి ఏమిటంటే మీ పేరు ఏమిటని ఎవరేనా అడుగుతే, పార్వతీశం అని చెపితే చాలు. అంటారు. కంటారు, వింటారు లాటివి ఏమీ చేర్చక్కరలేదు ఇంటి పేరు వాళ్ల కవసరం లేదు.

ఇక తరువాత సంగతి. ఇక్కడ గదులు అద్దెకు తీసుకోవడము విషయము మీకు చెప్పాలి. ఇక్కడ గదులు అద్దెకు యిచ్చేవాళ్లను అందరినీ “లోయర్ మిడిల్ క్లాస్” అంటారు. అంటే మనబోటి మధ్య తరగతి కుటుంబాలలో తక్కువ స్థితి గలవాళ్లు అన్నమాట. సాధారణంగా వితంతువులు. కాని, వివాహమే ఎరుగని వృద్ధ కన్యలు కాని సంపాదన తక్కువగా ఉన్న భార్యాభర్తలు కాని, తమకు అవసరమైన వాటికంటే ఒకటి రెండు గదులు ఎక్కువగా ఉండే ఇళ్లు అద్దెకు తీసుకొని, వాటిలో వారికి అవసరములేని గదులు రెండు అద్దెకు ఇస్తారు. ఆ గది కుర్చీలు సోఫాలు వగైరాలతో అలంకరణ చేసి కూడా ఉంటుంది. అంటే మూడు నాలుగు కుర్చీలు, ఒక సోఫా, ఒక టేబులూ, ఒక మంచం, పరుపూ, దానిమీద తలగడలూ, పక్క దుప్పటి కప్పుకోవడానికి రగ్గులూ, తుడుచుకోవడానికి తువ్వాళ్లూ కూడా ఉంటవన్న మాట. గది అద్దె వాటన్నిటికీ కలుపుకునే నన్నమాట. అంతే కాదు తువ్వాళ్లూ, సబ్బులూ కూడా వాళ్లే యిస్తారు. తరువాత ప్రతి గదిలోనూ - నా గదిలో నీవు చూసే వుంటావనుకుంటాను. ఫైర్ ప్లేన్ అనేది ఒకటి ఉంటుంది. గోడలో ఒక పొయ్యి అమర్చి అందులో బొగ్గులు పేర్చి నిప్పువేస్తారు పొగ గదిలోకి రాకుండా పైకి పోయేటట్లు ఒక గొట్టము ఉంటుంది. ఇది సంవత్సరములో ఏడెనిమిది మాసములు అహర్నిశాదులు రావణాసురుడి కాష్టంలా రాజుతూనే ఉంటుంది. ముఖ్యంగా శీతాకాలంలో ఆ పొయ్యి దగ్గరనే కుర్చీలు వేసు కుని కూర్చుంటారు. గదిఅంతా వెచ్చగా ఉంటుంది మీ రీపాటికి అది కనిపెట్టేఉంటారు.

ఇక్కడ ఒక చిదంబర రహస్యం వుంది. ఈదేశస్థులు, ముఖ్యంగా తక్కువ జాతివారు. మొహమూ అది కడుక్కోరు. అన్నాడు. నేను నిర్ఘాంతపోయి “అదీ కడుక్కోరా?” అన్నాను. అది ఎవ్వళ్ళూ కడుక్కోరు. అన్నాడు. “మరయితే” అన్నాను. మనం బయటకు వెళ్ళేచోట, పక్కను కాగితాల చుట్టవుంటుంది. అందులో కాగితం చుట్ట తీసుకుని దానితో తుడిచేసుకుని మల విసర్జన చేసిన కమ్మోడ్ అనే పింగాణీ దాంట్లో పార వేస్తారు. అక్కడ కనపడే గొలుసు లాగుతే అందులోకి నీరు