పుట:బారిష్టర్ పార్వతీశం.pdf/184

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

మొక్కపాటి నరసింహశాస్త్రి

183

ఇచ్చినా టీ మట్టుకు వద్దనకూడదు. మనదేశంలో కాళ్ళు కడుక్కోవడానికి నీళ్ళూ, సేద తీర్చుకోడానికి చల్లని మంచినీళ్ళూ, గుమ్మంలోనికి రాగానే ఇచ్చినట్లు ఈ దేశంలో అన్ని వేళలా కష్టములోనూ, సుఖము లోనూ కూడా, ముందు టీ ఇస్తారు. అది వద్దన కూడదు.” అన్నాడు రాజు.

టీ తీసుకున్న తరువాతను నా చరిత్ర సవిస్తరంగా చెప్పమని రాజు అడిగాడు. “అసలుమీది ఏ వూరు” అన్నాడు? నేను ఈ “మొగల్తుర్రు” అన్నాను. “ఏమిటి! మొగల్తుర్రే! మాకు దగ్గర వాడవేవన్నమాట. ఆ వూళ్ళో మా బంధువులు కూడా చాలామంది వున్నారు. మాది పూర్వం పోడూరులే” అన్నాడు. తరువాత నా సంగతంగా వివరముగా నే చెప్పగా సావధానముగా విన్నాడు. నాకేదైనా గది చూసి పెట్టి కాలేజీలో చేర్పించి సహాయం చెయ్యమని కోరాను. “అలాగే తప్పకుండా చేస్తాను. యిదో పెద్ద సహాయం ఏమిటి? పరదేశంలో మనం ఒకళ్ళ కొకళ్ళు సహాయం చేసుకోకపోతే, పరాయివాళ్లు యెవరు ఏమి చేస్తారు?” ఈ పూట కాసేపు బయటకు వెళ్ళి పార్కులో కూర్చుని కబుర్లు చెప్పుకుందాము. రేపు వుదయాన్నే గది చూద్దాం అనీ అన్నాడు. మేమిద్దరమూ బయలుదేరి దగ్గరలోనే వున్న పార్కులో వెళ్ళి కూర్చున్నాము. అప్పటికి సుమారు ఆరు గంటలయింది. బాగా చీకటి పడిపోయింది. అయినా జనం కిటకిటలాడుతున్నారు. ఆడా, మగా యెంత మందో! అదివరకు అక్కడ ఆడుకుంటున్న పిల్లలందరూ బిలబిల్లాడుతూ, తొందర తొందరగా యిళ్ళకు పరుగులు పెడుతున్నారు. పార్కులోకి వచ్చినవాళ్ళలో చాలా మంది యువతీ యువకులు జంటలు జంటలుగా బల్లమీద కొందరూ, కిందవున్న గడ్డిమీద కొందరూ కూర్చునీ పడుకుని నవ్వుకుంటూ, కబుర్లు చెప్పుకుంటూ, మధ్య - మధ్య ఊపిరాడకుండా, గాఢాలింగన చుంబనాదులు కావిస్తూ ఈ ప్రపంచం మరచి మరో ప్రపంచంలో వుండిపోయారు. అందుచేతను, మాకేసి చూసిన వాళ్ళే ఎవరూ కనపడలేదు. తమరు తప్ప ఆపార్కులో ఇంకెవరూ లేనట్టుగానే భావించుకుని ఆనందిస్తున్నారు. అందుచేతను మేమూ హాయిగా, గడ్డిమీదనే ఒకచోట సుఖంగా కూర్చున్నాము.

“బాబూ! మీ పేరేమిట”న్నాడు రాజు. “నన్ను పార్వతీశం అంటారు. మా యింటి పేరు వేమూరివారు” అన్నాను. సరేబాగుంది కాని, ఇక్కడ సంగతి సందర్భాలూ, ఆచార వ్యవహారాలూ, కొన్ని టూకీగా నైనా మీకు చెప్పాలి. ఆ పద్ధతులు మీరు తెలుసుకుంటే, వాటికి అనుకూ