పుట:బారిష్టర్ పార్వతీశం.pdf/181

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

180

బారిష్టరు పార్వతీశం

ఈజ్ బ్లాక్ మమ్మీ (నల్లని మనిషి అమ్మా)” అన్నారు. ఇంకొకడు “అమ్మా ఆ నల్లటాయన పిల్లల్ని యెత్తుకుపోతాడా” అన్నాడు. “యింకొకడు అమ్మా అతనెప్పుడు స్నానము చేయడా” అన్నాడు. వాళ్ళ తల్లులు వాళ్ళ నోళ్లు నొక్కి “తప్పు అలా అనకూడదు. ఇంకనెప్పుడైనా అలా అంటే దెబ్బలు తగులుతాయి జాగ్రత్త” అని భయపెట్టారు. నా దగ్గరకు వచ్చిన పిల్లలను చూచి వాళ్ళ ధైర్యానికి సంతోషించి “హలో” అని వాళ్ళను పలకరించపోయాను.

వాళ్లు హడిలిపోయి పారిపోయారు. నవ్వుకుంటూ నా దారిన నేను ముందుకు సాగాను. యెంతో దూరము వెళ్ళనక్కర లేకుండానే ఒకవీధిలో స్టేషనులో ఆసామీ చెప్పినట్లు “గదులు అద్దెకివ్వబడును” అనే బల్లలు కనపడ్డాయి. అలాంటి ఒక ఇంటి ముందుకు వెళ్ళి గుమ్మానికి ఉన్న బొత్తాయి నొక్కి నిలబడ్డాను. ఒక ముసలమ్మ తలుపుతీసి నా ముఖం కేసి చూచి యెంతో అసహ్యముతో “ఓహ్” అని భళ్లున తలుపు వేసుకుని చక్కా పోయింది. నవ్వుకుంటూ నేను మరో యింటికి వెళ్ళాను. అక్కడ ఒక నడివయస్సావిడ తలుపుతీసి నన్ను యెగాదిగా చూస్తూ “ఏం కావాలి” అన్నది. “గది కావాలన్నాను” “గదులు ఖాళీ లేవండీ, వెరీ సారీ” అని మర్యాదగా అబద్ధమాడి వెళ్ళిపోయింది. మరొక చోటకు వెళ్ళితే ఆ యింటి ఆవిడ నా బోంట్లకు తమ గది అద్దెకివ్వడం ఇష్టము లేనట్లు ముఖములో ప్రకటిస్తూ బోలెడంత అద్దె చెప్పింది. ఆవిడ భావం గ్రహించుకుని బయట పడ్డాను.

ఇంకొక యింటి దగ్గర ఒక ముసలమ్మ తలుపుతీసి, ఏదేశం మీది ఆఫ్రికా దేశమా? అన్నది. “కాదు ఇండియా” అన్నాను. “ఓహో! ఇండియా. చాలా సంతోషం. అక్కడ యెవరైనా మహారాజుబిడ్డవా” అంది. నేను నవ్వుతూ కాదన్నాను. నేను మహారాజునేమీ కాదు. మామూలు వాడినే ఇక్కడ చదువుకోడానికే వచ్చాను. గది కావాలి” అన్నాను.

నవ్వుతూ, విచారం వ్యక్తం చేస్తూ, “ప్రస్తుతం ఖాళీలేదు. ఒక వారము రోజులలో ఒక గది ఖాళీ అవుతుంది. అప్పుడు వస్తే యిస్తానంది. ఆ మాటకే సంతోషించి మరికొంత దూరము ముందుకు వెడుతుండగా మన దేశస్థుడు ఒకతను నా కెదురుగుండా వస్తున్నాడు. నా ప్రాణం లేచివచ్చినట్టయింది. రక్షించావు నాయనా అనుకున్నాను. అతనిని ఆపి “గుడ్ మార్నింగ్” అని నా అవస్థ చెప్పి, ఏం చెయ్యాలో నాకు సలహా యివ్వమన్నాను. “సరే నాతోటిరా” అనికొంచెం సమీపములో ఉన్న