పుట:బారిష్టర్ పార్వతీశం.pdf/180

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

మొక్కపాటి నరసింహశాస్త్రి

179

నిలబడేఉన్నాను. అతనూ నిలబడే వున్నాడు. నేను చెబుతాను తమరు దయచెయ్యండి, అని కుర్చీ చూపించాడు. తను మాత్రము నిలబడే ఉన్నాడు. తమకు యూనివర్సీటీకి దగ్గరగా ఉంటే, వీలుగా ఉంటుంది కదా! ఇక్కడ “ఈ ట్రాము ఎక్కి నే చెప్పే వీధి దగ్గర ఆపమంటే ఆపుతాడు. అవన్నీ నివాస గృహాలుండేచోటు, అక్కడయేవిధిలో చూసినా 'Room to let' (గదులు అద్దెకివ్వబడును) అని అట్టల మీద వ్రాసి, కిటికీలకు కట్టి వుంటాయి. మీరు గుమ్మానికి కుడిపక్కనో ఎడమపక్కనో ఉండే బొత్తాములలో ఒకదానిని నొక్కితే, తలుపు తీస్తారు. గుమ్మానికి ఎడమవైపున ఈ అట్ట కనబడితే, ఎడమవైపు బొత్తాము, కుడి ప్రక్కను కనబడితే కుడి వైపు బొత్తాము నొక్కాలి. క్రింద భాగంలో అయితే క్రింద బొత్తాము, పై అంతస్తులలో అయితే, ఆ అంతస్తు బొత్తాము నొక్కాలి. అప్పుడు మీకు వీలయిన గది, వీలయిన వీధిలో, వీలయిన అద్దెలో, ఎన్నుకోవచ్చును” అన్నాడు. ఎంతో ఓపికగా ఎంతో సావకాశముగా, ఎంతో వినయముగా చెప్పాడీ సమాచారమంతా. నేను “ధేంక్ యూ” అని బయటకి వచ్చాను. నా వెనక అతను లోపలున్న, నేను ఫలహారము చేసిన పళ్లాలు వగైరా తీసుకుని, తలుపు మూసి, బయటకు రావడము గమనించాను. రోడ్డు మీదకు వస్తుంటే, చాలామంది నా కేసి తేరిపార చూడడం ఒకరిద్దరు మందహాసము చేయడం గమనించాను. నవ్వుతే నా కేమి? వాళ్ళమూతే వంకర పోతుంది అనుకునీ ట్రాము నిలిచే చోటు తెలుసుకుని అక్కడకు వెళ్ళి నిలబడ్డాను. స్టేషనులో అతను చెప్పిన నెంబరు ట్రాము రావడముతోనే అదెక్కి అతను చెప్పినచోట దిగాను.

8

అక్కడొక చిన్న పార్కు వున్నది. యెంతో మంది పిల్లలు, కొందరు వంటరిగానూ, కొందరు తల్లులతోటి వచ్చి అందులో ఆడుకుంటున్నారు. నాకు వాళ్ళను చూస్తే యెంతో ముద్దు వచ్చింది, ఒక క్షణం వాళ్ళ ఆటలు చూస్తూ అలా నిలబడిపోయాను. నాకు తెలియకుండానే నాముఖంలోకి చిరునవ్వు వచ్చింది. కొందరు పిల్లలు నన్ను చూచి దూరముగా తొలగిపోయారు. ఒకరిద్దరు సాహసించి నా దగ్గరకు వచ్చి కళ్లు పెద్దవిచేసి, భయముతోనూ, ఆశ్చర్యముతోనూ, నన్ను చూస్తూ నిలబడిపోయారు.

నా వెనుకను కొంచెము దూరములో ఒకళ్ళిద్దరు పిల్లలు, నన్ను చూచి పరుగెత్తుకు వెళ్ళి తల్లులను కౌగలించుకుని “మమ్మీ, మమ్మీ, దేర్