పుట:బారిష్టర్ పార్వతీశం.pdf/179

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

178

బారిష్టరు పార్వతీశం

గోయింగ్ సర్. కెన్ ఐ హెల్ప్ యూ సర్ (తమరు ఎక్కడకు వెళ్ళు తారు. నేను చెయ్య గలిగినది ఏమయినా ఉన్నదా) అన్నాడు వినయంతో. వాడి వినయ విధేయతలు చూస్తే నాకు ఎంతో ముచ్చట వేసింది. నేను ఎక్కడికి వెళ్ళాలో తెలీదు. ఊళ్ళోకి వెళ్ళి గది ఏదైనే చూసుకునే వరకూ ఏమి చెయ్యడమా అని ఆలోచిస్తున్నాను. “ఈ స్టేషనులోనే గదులుంటాయండీ. ఈ సామాను అందులో పెడతాను. మీరు సావకాశంగా ఫలహారము అదీ చేసి, ఊళ్ళోకి వెళ్ళవచ్చును. సామాను ఇక్కడ జాగ్రత్తగా ఉంటుంది. అవసరమైతే ఒకటి, రెండు రోజులు ఆ గదిలోనే కొద్దిపాటి అద్దె యిచ్చి ఉండవచ్చును.” అన్నాడు.

బ్రతుకు జీవుడా అనుకొని, “థాంక్ యూ అన్నాను. వాడు నా సామాను సహితముగా నన్నో గదిలోకి తీసుకు వెళ్ళి, సామాను అక్కడ పెట్టి పక్కనున్న చిన్న గది మరొకటి చూపించి,” అందులో మీరు కాల కృత్యాలు తీర్చుకోవచ్చును. అక్కడ గోడనున్న బొత్తాములాటిదినొక్కతే మనిషి వచ్చి మీకు ఫలాహారము వగైరా తెచ్చి పెడతాడు అని నాకో సలాము పెట్టి నెమ్మదిగా గది తలుపు తన వెనకాల మూసుకుని బయటకు వెళ్ళి పోయాడు. చాలా ఆశ్చర్య మనిపించింది. సరే ఏకంగా వెళ్ళేటప్పుడు ఏదేనా ఇవ్వవచ్చు ననుకున్నాను. నేనుకోటు వగైరా దుస్తులు తీసి వేసి కాల కృత్యాలు తీర్చుకుని ఒక అరగంటలో మళ్ళీ డ్రస్సు వేసుకుని వాడు చెప్పిన బొత్తాము నొక్కాను. అర నిమిషంలో భూమిలోంచి వచ్చినట్లు ఒక మనిషి ఎదురుగుండా వచ్చి నిలుచుని, గుడ్ మార్నింగ్ సర్ అని “తమ కేమి కావాలి?” అని ఎంతో భయభక్తులతో అడిగాడు. నాకు ఫలహారమూ, టీ తెచ్చి పెట్టమన్నాను. ఈ నాలుగైదు రోజులలోనూ ఈ పద్ధతులన్నీ బాగా అలవాటు అయినాయి. “క్షణంలో తీసుకువస్తానండి” అని అతను బయటకు వెళ్ళి అన్నట్టుగానే మరుక్షణంలో అన్నీ తీసుకు వచ్చి బల్లమీదను అమర్చి, మళ్ళీ ఏమైనా కావలిస్తే ఆబొత్తాము నొక్కండి. అని చెప్పి తలుపు మూసుకుని వెళ్ళిపోయాడు.

నేను సుఖముగా ఫలహారము చేసి బయటకు వెళ్ళే ప్రయత్నములో ఆ బొత్తాము నొక్కాను. ఇందాకటి మనిషి మళ్ళీ వచ్చాడు. “నాకీ వూరు కొత్త. నేనెప్పుడూ యీ వూరు రాలేదు. ఇక్కడ చదువుకోడానికి వచ్చాను. కొంత కాలముపాటు ఇక్కడే ఉండాలి కదా! ఉండడానికి ఒక గది కావాలి. ఎక్కడ దొరుకుతుంది? యెలా వెళ్ళాలి? యెలా ప్రయత్నము చెయ్యాలి? ” అని నిర్మోహమాటముగా, అడిగాను, నేను