పుట:బారిష్టర్ పార్వతీశం.pdf/178

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

మొక్కపాటి నరసింహశాస్త్రి

177

“నువ్వు కొత్తగా వచ్చావా!” అన్నాడు అందులో ఒకడు, నోట మాటరాక, తలవూపాను.

నీకేమీ భయం లేదులే, ఇక్కడ హాయిగా వుంటుంది. పడుకుని సుఖంగా నిద్రపో అన్నాడు.

“థేంక్ యూ” అన్నాను, రైలు వేగం అందుకుంది. నా మనస్సు అంతకంటే వేగంగా స్వదేశానికి వెళ్ళింది.

మీనన్ చెప్పినట్లు రైలు ఖాళీగా వున్నదిగదా అని తలగడలు వేసుకుని, రగ్గులు కప్పుకుని, సుఖంగా పడుకున్నాను. ఒక్క క్షణం ఈ సూటు వగైరా మార్చాలా! అనే సందేహం కలిగింది. రైలులో ఈ బాధంతా ఎందుకని అలాగే పడుకుంటే, తీరిపోతుందనుకున్నాను. కాలిజోళ్ళు, మేజోళ్ళు మటుకు తీస్తే గాని వీల్లేదనిపించింది, తలగడాలు బహు మెత్తగా, హాయిగా వున్నాయి. ఇంత మెత్తని తలగడాలు నేనెక్కడా చూడలేదు. నిజం చెప్పాలంటే, మా యింట్లో తలగడాలు రాళ్లులా వుండేవి. ఇటిక బొంత తలకింత పెట్టి దాని పైన దుప్పటి కప్పితే, మా యింట్లో తలగడాయే అనుకునేవాణ్ని. ఈ దేశంలో దూది, ఇంత మెత్తగా వుంటుంది కాబోలు! అనుకుంటూ కళ్లు ముయ్యబోతుంటే, ఇంతసేపూ, నాకేసే నిదానంగా చూస్తున్న ఎదరబల్లమీద మనిషి, చిరునవ్వుతో గుడ్ నైట్ సర్, సౌండ్ స్లీప్. ప్లెజంట్ డ్రీమ్స్ అన్నాడు.

నేనూ Thanikyou అనీ నవ్వి కళ్లుమూసుకున్నాను. కళ్లు మూయడం తడవుగా నిద్రపట్టింది కాబోలు నా కేమీ తెలియలేదింక. కొంచెం మెలకువ వస్తున్నట్లు ఉండగా, రైలులో సంచలనం బయలుదేరింది. రైలు ఆగినట్లు తెలుసుకున్నాను. నా కెదురుగా వున్న సోదరులు మాయమయ్యారు, ఎక్కడ దిగాలో తెలియలేదు. సామానుఏమైనా కూడా మాయమయ్యిందేమోనని అనుమానంతో అడుగున చూశాను. బల్లకింద సామానులు అలాగే మైమరచి నిద్రపోతున్నాయి. రైలు ఆగింది. అందరూ దిగిపోతున్నారు “ఇదేనా ఎడింబరో” అని ఒక అసామీని అడిగాను. “ఔను” అన్నాడు. మీనన్ చెప్పినట్లు రగ్గులు మడిచేసి, తలగడాల మీద పెట్టి సామానుతో సహా దిగాను. ఇప్పుడేమి చెయ్యడమా అని ఆలోచిస్తుండగా ఒక రైలు బంట్రోతు వచ్చి నవ్వుతూ “మార్నింగ్ సర్" అన్నాడు తన నెత్తి మీద టోపీ ముట్టుకొని. “హాడ్ సౌండ్ స్లీప్ సర్” (బాగా నిద్ర పట్టినదాండీ) వేరార్ యు