పుట:బారిష్టర్ పార్వతీశం.pdf/177

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

176

బారిష్టరు పార్వతీశం

మీనన్ నన్ను చూసి నవ్వుతూ.

"ఈ దేశం రైల్వే కంపెనీవాళ్లు ప్రతిరోజూ, ప్రతిమనిషికి, రాత్రులు యివీ అద్దెకు యిస్తారు. మనం దిగి వెళ్ళేటప్పుడు వాటిని రైలులో విడిచి పెట్టి వెళితే, వాళ్లు తీసి జాగ్రత్త పెట్టుకుంటారు. ఎప్పటికప్పుడు వాటిని శుభ్రముగా వుంచుతారు.” అన్నాడు.

“మరి అందరూ, మనకిమల్లే న్యాయంగా వుండి. యివి కొట్టెయ్య కుండా వుంటారన్నమాటేమి” టని అన్నాను.

అతను నవ్వుతూ “ఇది మనదేశం కాదుగదా! ఈ దేశంలో అలాంటి పనీ యెవ్వడూ చెయ్యడు. అలాంటి కక్కుర్తిపనులు యిక్కడికి వచ్చిన మనవాళ్ళూ చెయ్యరు” అన్నాడు మీనన్.

“నువ్వేమీ భయపడవద్దు. జనసమ్మర్థం లేకపోతే, నీవు సుఖంగా పడుకో, లేకపోతే యీ రగ్గులు కప్పుకుని నీచోటులో నువ్వు విశాలంగా కూర్చో, యెంతరద్దీ అయినా, బల్లకు ముగ్గురుకంటే కూర్చోరు. ఇంత కంటే నాలుగోవాడు రాడు. సుఖంగా వెళ్ళు. నీవక్కడ క్షేమంగా చేరినట్లు తక్కిన యేర్పాటులన్నీ నీవు చేసుకోగలిగిన సంగతి, నాకు సావకాశంగా ఉత్తరము వ్రాయి, నేను వెడతాను. మరింక” అన్నాడు.

ఈ రెండు రోజులనుంచీ అతడు నాకు చూపిన ఆదరం, నాకు చేసిన ఉపకారం, తలుచుకుంటే, నాకు కళ్ళనీళ్లు వచ్చాయి ఈ దూర దేశంలో ముక్కూ మొహం తెలియని నాకు యితనింత ఉపకారము, ఇంత అవ్యాజమైన ఆదరము చూపించడము, యెంత గొప్ప! యెంత విశాల హృదయము! అనుకుని, నమస్కారం చేస్తూ, కొంచెం వణుకుతున్న కంఠంతో, బయటకు వచ్చిన కన్నీటితో నాకృతజ్ఞత అతనికి ముక్తసరిగా రెండు మాటలలో చెప్పగలిగాను. యింతలో రైలు కూత వేసింది. అతను నన్నొక్కమాటు ఆలింగనము చేసుకుని, భయములేదు తమ్ముడూ అన్నీ వాటంతటవే సవ్యంగా జరుగుతాయి. బెంగ పెట్టుకోకు, హాయిగా వుండు.

పరమేశ్వరానుగ్రహం వుంటుంది - అని కరచాలనము చేసి, గబుక్కున రైలు దిగాడు. అతను నాకు చెయ్యి వూపుతుంటే, రైలు కదిలింది. నిలబడ్డ వాణ్ణి నా స్థానములో చతికిలబడ్డాను, రైలులోనూ, బయటా, వున్న జనం వస్తువులూ, ఒక్క క్షణం ఏమీ కనపడలేదు. కళ్ళు తుడుచుకుని కూర్చున్నాను. నా ఎదుట బల్ల మీద వున్న ఇద్దరూ నాకేసి, ఆర్ద్రతతో చూశారు.