పుట:బారిష్టర్ పార్వతీశం.pdf/176

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

మొక్కపాటి నరసింహశాస్త్రి

175

ఎంతో బిగువుగా ఉన్నాయి, కొంచెం ఒంటికి గుచ్చుకుంటున్నట్టు ఉందీ కూడాను. “ఇదేమిటి? ఇంత బిగుతువి ఇచ్చా” డన్నాను. అది అంతే అలాగే ఉండాలి. రెండు రోజులు తొడుక్కుంటే, అవే వదులవుతాయి, అవి ఒంటిని అంటిపెట్టుకుని ఉంటే! ఎంత వెచ్చగా, హాయిగా ఉంటుందో నీకే తెలుస్తుంది. ఆడవాళ్ళను ఆలింగనము చేసుకున్నంత సుఖంగా ఉంటుంది. అన్నాడు నవ్వుతూ. “ఏడిసినట్టే వుంది వెధవ కబుర్లూ వీడూను. అస్తమానం ఆడవాళ్ళను ఆలింగనం చేసుకుంటూ కూర్చుంటాడు కాబోలు” అనుకుంటూ కొంచెం సిగ్గుపడ్డాను.

ఇవన్నీ నెమ్మదిమీద తెలుస్తాయిలే. అంటూ “బయలుదేరుదాం” అన్నాడు. నేను త్వరగా దుస్తులు తొడుక్కోవడం ముగించుకుని, మళ్ళీ సామాను కట్టేసుకుని, బయటకు వచ్చాను. అక్కడ ఉండే నౌఖరుని మీనన్ పిలిచాడు. వాడు సామాను తెచ్చి వీధిలో పెట్టాడు. మేము హాలులోకొచ్చి, అక్కడ మహంకాళి మేనేజరమ్మ దగ్గరకు వెళ్ళి, నేనిప్పుడు ఎడింబరో వెడుతున్నానండి. నా బిల్లు ఎంతయిందో చెపితే, చెల్లించుకుంటాను అన్నాను. బిల్లు అప్పుడే, ఎప్పుడు సిద్ధమైందో అక్కడకు అప్పుడే ఎలా వచ్చిందో తెలి యదుగాని, బల్లమీద ఉన్న కాగితం నాకు అందించింది. వెంటనే సొమ్ము చెల్లించాను. ఆవిడ మందహాసం చేస్తూ రసీదు నాకు అందించింది. “విష్ యూ గుడ్ లక్” అని నా కరచాలనం చేస్తు “గుడ్ బై” అని నాకు సెలవు ఇచ్చింది. నేను వీధిలోకి వచ్చేసరికి మీనన్ గుర్రబ్బండి పిలిచి సామాను అందులో పెట్టించి, నన్ను అందులో ఎక్కమన్నాడు.

స్టేషనుకు వచ్చాము. మీనన్ టిక్కెట్టుకొని పెట్టాడు. రైలెక్కించాడు. ఈ రైలులోకూడా అన్ని పెట్టెలలోనూ పరుపులు వున్న బల్లలే. నేను సామాను బల్లకింద పెట్టి నా పక్క చుట్టు తీసి విప్పపోతుంటే, మీనన్ నన్ను వారించి, “అదేమి విప్పకప్పుడు” అన్నాడు. “మరెలా! రాత్రి చలిగదా! నా శాలువా తీసుకోనా” అన్నాను.

“అక్కరలేదు. చూస్తూవుండు. నేను గారడీచేసి, నీకు తలకిందకు తలగడాలు. కప్పుకోడానికి రెండు రగ్గులు తెప్పిస్తాను.” అన్నాడు.

అతని మాటలు పూర్తి కాకుండానే, రైల్వే పోర్టరు ఒకతను తెల్లని చాకలి తెచ్చిన గలీబులు తొడిగిన రెండు తలగడలు, కప్పు కోవడానికి నా అంత బరువున్న రెండు రగ్గులూ, తెచ్చి బల్లమీద పట్టాడు. మీనన్ వాడి చేతిలో ఒక షిల్లింగు పెట్టాడు. నేను వెర్రిమొగం వేసుకొని చూస్తున్నాను. ఇవి తెచ్చిన నౌకరు వెళ్ళిపోయాడు. రైలులోకి జనం వస్తున్నారు,