పుట:బారిష్టర్ పార్వతీశం.pdf/173

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

172

బారిష్టరు పార్వతీశం

కేసిచూసి అక్కడ కనపడ్డభయ, సందేహాలు చూచి, నవ్వుతూ ఇవ్వాళకి ఇంతవరకు చాలులే అన్నాడు. అంటే రేపు మళ్ళీ అక్షింతలు వెనకేసు కొని బయలుదేరవలసిందేనా?” అన్నాను. నేనన్నది అతనికి అర్థమైనట్టు కనిపించలేదు. “ఏమీ అక్కరలేదు. ఇవేళ నువ్వు వెళ్ళిపోతున్నావుకదా! ప్రస్తుతానికి ఇంకేమి సోకు అవసరంలేదు.” అన్నాడు. చిల్లర సామానులు ఏమైనా కావలిసినవి. యెడింబరో వెళ్ళిన తరువాత అక్కడ యెవరినైనా సాయం తీసుకొని కొనుక్కోవచ్చు నన్నాడు. అక్కడితో ఆ పూట కార్యక్రమం ముగించుకుని వెంటనే మా బసకు బయలుదేరాము. ఈ మాటు అడుగురైలూ, కాక పై ట్రామూ కాక, గుర్రబ్బండీ చేసుకుని బసకు చేరుకున్నాము. మనకు వాహన యోగము పట్టిందేమి టన్నాను. యిప్పుడు మంచి తొందర సమయం. ఈ వూళ్ళో నూటికి తొంభయిమందీ జనాభా, వాళ్ళ వాళ్ళ పనులమీద తిరుగుతుంటారు. రైళ్లలోనూ ట్రాముల్లోనూ కూడా చాలా యిరకాటముగా వుంటుంది. ఇలా అయితే ఒకళ్ళ ప్రమేయం లేకుండా, నాలుగు డబ్బులు యెక్కువయినా త్వరగా బసకు చేరుకోవచ్చుననీ, సమాధానము చెప్పాడు. ఈకబుర్లు పూర్తయేసరికి మా బసకు రానే వచ్చాము. “రా తొందరగా” అని అక్కడ నిలబడి ముందుకూ, వెనక్కూ పరుగెత్తే జనాభాని చూస్తున్నవాణ్ణి బసలోకి లాక్కుపోయాడు.

“యింకా నాకు పనివుంది. నేను ఊళ్ళోకి వెళ్ళాలి. నువ్వు సాయంత్రము దాకా యెలగో కాలక్షేపం చేసుకో. నేను సాయంత్రము వచ్చి, నిన్ను కలుసుకుని రాత్రి రైలు యెక్కిస్తాను.”

అంటూ, నా కృతజ్ఞతా వచనాలు వినకుండానే, తన గదికి వెళ్ళి పోయాడు.

నేను నా గదిలోకి వెళ్ళి కొన్న సామానులన్నీ మంచంమీద పెట్టుకు కూర్చుని! ఒకటొక ఓ విప్పి, వాటినిచూసుకుని మురిసిపోతూ, వెధవడబ్బు పోతేపోయిందిగాని యిలాంటి వస్తువులు మనకి యెక్కడ దొరుకుతాయి? అనుకున్నాను.

వస్తువులు, వాటి నాణ్యం యెలా వున్నా కొన్న ప్రతివాడికీ, అలా యింత చక్కని పెట్టెలలో అందముగా కట్టి యిస్తారు? లేక నాబోటి విదేశీయులకి వాళ్ళేదో పెద్ద వాళ్ళనుకొని యిలా అందముగా అమర్చి యిస్తారా? అనుకున్నాను. ఏమైనా యిక్కడి యేర్పాట్లూ పద్ధతులూ, ఏది చూసినా చాలా అందముగాను, హందాగాను, కనబడ్డాయి. వాళ్ళ నాగరికత అంటే, యిదే కాబోలు అనుకున్నాను. వాటన్నిటి మాటా