పుట:బారిష్టర్ పార్వతీశం.pdf/172

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

మొక్కపాటి నరసింహశాస్త్రి

171

యీ బాధ అంతా ఎందుకనుకుని దర్జాగా “మీనన్ సోదరా, నీకంటే, నా కెక్కువ తెలుసా నువ్వే చూచి ఏర్పాటు చేయించు వాటి మంచీ చెడ్డలు నాకంటే నీకే తెలుసు” అన్నాను. మీనన్ సంతోషించాడు. సరే ఇటు రమ్మని ఇంకొక బల్లదగ్గరికి తీసుకు వెళ్ళి నాలుగైదు రకాల మెడ పట్టీలు, అవగా టై లన్నమాట చూపించాడు. ఇక్కడందరు మగవాళ్ళూ, మెడకి వురేసుకున్నట్లు ఇదొకటి కట్టుకోక తప్పదట! ఎందుకో నాకు అర్థం కాలేదు. ఏమీ అడగటానికీ తెలుసుకోడానికి వీలులేదాయె. ఇక్కడిదో చావొచ్చి పడింది.

తరువాతను ఒక అరడజను కాలర్లు తెప్పించాడు. ఆ తరువాతను సూటు లోపల తొడుక్కోవడానికి వొంటి వంటి పెట్టుకుని ఉండే బనీనులు, అటువంటివే షరాయిలు, రెండు జతలు తెప్పించాడు. ఇంకొక రెండు జతలు మేజోళ్లు తెప్పించాడు. ఇవన్నీ చూస్తుంటే, నా గుండె ఆగి పోయినంత పని జరిగింది. ఏమటి మీనన్ గారు, తనేదో జమీందారైనట్టూ, నేనంతకంటే జమీందారునైనట్టూ, కళ్ళుమూసుకుని, ఒకదాని తరువాతను ఒకటి తెప్పిస్తున్నాడు. వీటన్నిటికీ డబ్బెవడిస్తాడు? వాడుగాని, వాడి అబ్బగాని యివ్వడు కదా! నా బోటి వాటికి ధర్మం చెయ్యడానికి యీ దుకాణము పెట్టబడ లేదుగదా! అయినా యీ మేజోళ్ళూ, యీ వురితాళ్ళూ యిన్నెందుకు? ఒకటో, రెండో ఉంటే మాసిపోయినప్పుడు, రాత్రిళ్ళు ఉతికి ఆరేసుకుంటే తెల్లవారేటప్పటికి శుభ్రముగా ఉండవా? వాటన్నిటికీ వందో, రెండువందలో అయిందంటే, నే నిప్పుడు యెక్కడ నుంచి తేను! లేదని చెప్పడమెలాగ అని అనుకుంటుండగానే, మేము యెస్నుకున్నవన్నీ, అక్కడ మనిషి లోపలకు తీసుకు వెళ్ళి వాటిని చిన్న అందమైన అట్టల పెట్టెలో అమర్చడమూ, సూటు యింకొక పెట్తెలో అమర్చడమూ, వాటిని చక్కగా అందమైన రిబ్బనులాంటి దానితో కట్టడమూ, తీసుకువచ్చి నా ఎదుట పెట్టడమూ, జరిగిపోయింది.

మీనన్ బిల్లు నా చేతికి ఇచ్చాడు. నేను రాబోతున్న కన్నీటిని మందలించి వెనక్కి పంపించి డబ్బు కిక్కురు మనకుండా మీనన్ చేతిలో పెట్టాను. యెంతయిందని అడగకుండా. వింటే మీరు హడలిపోతారు. అవి చంకన పెట్టుకుని బయటకు వచ్చాను.

ఒక క్షణం బయట నిలబడి, “ఇంక కొనవలసిన వేమీ లేవు కదా” అన్నాను. యింకా బోలెడన్ని వున్నాయి. అంటాడేమోనని ఒక్క క్షణం ఊపిరి బిగబట్టుకుని, నిలబడ్డాను. మీనన్ ఒక్క క్షణం నా మొహం