పుట:బారిష్టర్ పార్వతీశం.pdf/171

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

170

బారిష్టరు పార్వతీశం

లోతున ఇలా సొరంగాలు యెలాచేశారో! యెంతో ప్రమాదము కదూ? ఇది అమాంతంయే భూకంపమో వచ్చి, కూలిపోతే యేమవుతుంది? తరువాతను, లోపలకు వెలుతురూ, గాలీ యెలా వస్తున్నాయో? కానీ మా మిత్రుడిని అడగడానికి వ్యవధి లేకపోయింది. అతడు సమాధానం చెప్పే స్థితిలో ఉన్నట్టు కూడా కనబడలేదు.

మేము తొందర తొందరగా, నడుస్తూ ఒక బట్టల షాపులో ప్రవేశించాము. అక్కడ అద్దాల బీరువాలో ఎన్నో రకాల సూట్లు తయారయినవి సిద్ధముగా ఉన్నాయి. ఇవన్నీ ఎవరో కుట్టించుకున్నారు కాబోలును అనుకు న్నాను. మేము లోపలకు అడుగు పెట్టగా, నా దృష్టి ఈ బీరువాలమీదనే లగ్నము కావడము మూలాన్ని వాటికేసి చూస్తూ నిలబడ్డాను. లోపల ఒకాయన, మీనన్ దగ్గరికి వచ్చి, మాట్లాడడము నేను గమనించనేలేదు. ఇలా నాలుగైదు నిమిషాలు కావడముతోనే, ఆ ఆసామీ నాదగ్గరకు వచ్చినా పొడవూ కై వారమూ, వగైరా కొలతలన్నీ తీసుకోవడము మొదలు పెట్టాడు, ఒహో బట్టలు కుట్టడానికి కదా అవి,

“ఈ సాయంత్రానికి ఇచ్చేస్తాడా?” అన్నాను. “నేనివాళ వెళ్ళక తప్పదు సుమా” అన్నాను.

“మీకేం భయము లేదు అయిదు నిమిషాలలో ఇచ్చేస్తాడు ఏటొచ్చీ ఇక్కడ ఉన్న వాటిలో మీకేది నచ్చినదో చూపించండి” అన్నాడు. మనలో మనమాట, నా కేమి తెలుస్తుంది, ఆగుడ్డ నాణ్యం గాని, విలువగాని, నేను తెలుసుకోలేను గదా! అక్కడ బేరమాటడానికి వీలవుతుందో కాదో, ఎంత చెడ్డా, వాడు బట్టలమ్ముకునే కోమటి అయినా, దొర అయెను!