పుట:బారిష్టర్ పార్వతీశం.pdf/169

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

168

బారిష్టరు పార్వతీశం

అనుకోక చెప్పండి మీరు వేసుకున్న సూటు ఇండియాలో కుట్టించినదా! అలాగనే ఉన్నది చూస్తే. యిక్కడికి పనికిరాదు. చలిమాట యెలా ఉన్నా ఈ కుట్టూ యీ పద్ధతి చూస్తే యిక్కడ అందరూ నవ్వుతారు. తరువాత సూట్ అడుగున అండర్ ఉందా!” అని అడిగాడు. అదేమిటో నాకు అర్థం కాలేదు. నేను తెల్లబోయి అతని కేసి ప్రశ్నార్ధకంగా చూశాను. “వూరికే సూటు తొడుక్కున్నారా! దాని అడుగున యింకేమీ లేదా! అన్నాడు” యింకేమీ లేదన్నాను. అతను నిర్ఘాంతపోయి చాలా పొరపాటు చేశారు. ఇటువంటి దేశములో చాలా ప్రమాదము. అడుగున కూడా వున్నీతో తయారైనవి చర్మాన్ని అంటి పెట్టుకుని, ఉండే బనియన్ లాంటివి. కాళ్ళకూ ఒంటికీ కూడా తొడుక్కుని ఉండాలి. లేక పోతే చాలా ప్రమాదం అందుచేతను, ముందు యీ దుస్తులు సంగతీ యేదో చూడాలి. రేపు ఉదయాన్నే నేను వచ్చి మిమ్మల్ని బజారుకు తీసుకు వెళ్ళుతాను. మీకు కావలసినవి మీరు కొనుక్కుందురుగాని, రేపు గాని, తప్పితే యెల్లుండిగాని, వెడుదురుగాని, పెందలాడే భోజనము చేసి, సుఖముగా పడుకుంటే, హాయిగా నిద్రపడుతుంది. ఈ బడలిక తగ్గుతుంది. ఉదయాన్నే వచ్చి మిమ్మల్ని కలుసుకుంటాను. “గుడ్ నైట్” అని వెళ్ళి పోయాడు. అతను చెప్పినట్టుగానే నేను వెంటనే భోజనము చేశాను, వచ్చిపడుకున్నాను. కూర్చోడానికి కూడా ఓపిక లేకపోయింది. రేపు మళ్ళీ యేమికొనాలో, ఏమిటో? మళ్ళీ ఎంత ఖర్చవుతుందో అని ఆలోచనలో పడ్డాను. ఇప్పటికి ఏ రోజుకారోజు అయిన ఖర్చులో నావంతు నేను మీనన్ కి ఇచ్చేస్తున్నాను. అతను చిరునవ్వుతో థాంక్స్ అని తీసుకునేవాడు. ఇవేళ ఖర్చంతా మానేజరమ్మ పెట్టింది. యెవళ్ళనీ ఒక కానీ అడగలేదు. యెవరూయివ్వనూలేదు. ఇదంతా ఆఖరున బిల్లులో చేరుస్తుందో, లేకపోతే గవర్నమెంటువారు చేసిన వుచిత ఏర్పాటో తెలియలేదు. యిది యేమి తడిసి మోపెడు అవుతుందో అనే ఆలోచన పూర్తి కాకుండానే నాకు తెలియకుండానే నిద్రలో పడ్డాను.

ఉదయాన్నే లేచి దంతధావనాధికము పూర్తి చేసుకునేసరికి, మీనన్ మిత్రుడు వచ్చాడు.

“ఏమి సోదరా బయలుదేరుదాము సిద్దముగావున్నావా?” అన్నాడు.

మేమిద్దరమూ భోజనాల హాలులోకి వెళ్ళి టీ ఫలహారాదులు ముగించి వీధిలోకి వచ్చాము. సుమారు ఒక ఫర్లాంగు నడిచి, ప్రక్కకు తప్పుకొని, ఒక పెద్ద గేటు దాటి లోపలకు వెళ్ళాము. రెండు నిమిషాలలో మీనన్