పుట:బారిష్టర్ పార్వతీశం.pdf/168

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

మొక్కపాటి నరసింహశాస్త్రి

167

ఆవిడ ఆదరణకు, నాకెందుకో ఇట్టే దుఃఖము వచ్చింది. పైకి గంభీరముగా “ఫరవాలేదులెండి, మనతో వచ్చినవాళ్ళందరకూ ఇంకా చూడవలెనని వుంటే, చూపించండి, నేను కాస్సేపు ఇక్కడ కూర్చుంటాను” అన్నాను సిగ్గుపడుతూ.

“అబ్బేబ్బే - యెంతమాట - నాకూ పని వున్నది ఈ వేళకి చూచింది చాలు. మరొకప్పుడు తరవాత చూడవచ్చును. బసకే వెడదామురా” అని కారుదగ్గరికి దారితీసింది. కారులో కూర్చుని ఒక అరగంటలో బసకు చేరుకున్నాము.

అక్కడ నాకోసమే మా మిత్రుడు మీనన్ నిరీక్షిస్తూ కూర్చున్నాడు. నన్ను చూచి నవ్వి, నెమ్మదిగా నాతో నాగదిలోకి వచ్చాడు. గదిలో ప్రవేశించగానే ముందు నా కాలిజోళ్లు ఊడిదీసి, అవతల గిరవాటు పెట్టి, మేజోళ్లు కూడా తీసేశాను. నా బాధ గ్రహించి స్నానాల గదిలోకి వెళ్ళి, వేడినీళ్ళతో పాదాలు కడుక్కుని కాసేపు ఆ వేడినీళ్ళలోనే వుంచుతే, యీ నొప్పి లాగేస్తుందనీ, నేను వచ్చేదాకా తను కూర్చుంటానని, ముందాపని చేసుకోమని సలహా యిచ్చాడు.

సరేననీ, అడుగుతీసి అడుగు వెయ్యలేక నెమ్మదిగా స్నానాల గది చేరుకుని, అక్కడ మీనన్ చెప్పినట్లు, వేడినీళ్ళలో సుమారు పావుగంట సేపు కాళ్లు పెట్టుకుని కూర్చునే సరికి, శమనగా హాయిగా వుండి, నొప్పి చాలా భాగం చేత్తోటి తీసేసినట్టు పోయింది. కాళ్లు తుడుచుకుని నా గదిలోకి వచ్చాను. “ఏమండీ కాళ్లు ఏలాగా వున్నాయి. యిప్పుడేమైనా సుఖముగా ఉందా? - నొప్పేమన్నా తీరిందా అన్నాడు మీనన్, మీ దయ వల్ల చాలా భాగం బాధ తగ్గింది. ఈరాత్రి విశ్రాంతి తీసుకుంటే, రేపటికీ బాగా తగ్గుతుంది. అనుకుంటున్నాను. కాని, మరి యీరాత్రే ప్రయాణం అనుకున్నాను కదా? “అన్నాను. యింకొకటి రెండు రోజులు ఆలస్యమయినా, మునిగిపోయేది ఏమీలేదు. మీరు కాలేజీలో చేరడానికి యింకా కొంత వ్యవధి వున్నది. అందుచేత తొందరపడకండి రేపు వెళ్ళవచ్చు. మీకు యింకేమయినా యిక్కడ కొనుక్కోవలసినవి వుంటాయేమో ఆలోచిద్దాము, కూర్చోండి” అన్నాడు. నేను కూర్చున్న తరువాత రెండు నిమిషములూరుకుని “అయితే మీకు దుస్తులు సరిపడ్డన్ని వున్నవా! యీ చలికిమీరు ఆగగలుతున్నారా? యిబ్బంది పడడము లేదుకదా?” అన్నాడు.

“చలియెక్కువగానే వున్నదండీ. భరించడము కష్టముగానే ఉంది” అన్నాను. “మీబట్టలు ఏమి ఉన్నాయని నేను అడుగుతున్నానని ఏమి