పుట:బారిష్టర్ పార్వతీశం.pdf/167

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

166

బారిష్టరు పార్వతీశం

వాటిని చూస్తూనే ఒళ్లు జలదరించి భయమువేసింది. కాని నిదానముగా చూస్తూంటే, వాటిలో కూడా ఏదో కొంత సౌందర్యము ఉన్నట్టు అనిపించింది. చాలా చిత్రమే. ఈ సౌందర్యముతో పాటు విషమూ వికార ఆహారము యెందుకు కూర్చాడా భగవంతుడు! మరికొంచెము సేపు ఇంకా ఏవేవో రకాలు చూస్తూ, కాళ్లు పడిపోతుంటే, రెండుమూడు గంటల సేపు అలాగే ఓపికగా తిరిగి ఇంకో ఏవేవో చూడవలసినవి ఉన్న వన్నా అంతటతో ఆ పూటకు ముగించి, వెనక్కు మళ్ళాము. మా మానేజరమ్మగారు మా మీద దయతలిచి, ఒక టీ దుకాణము దగ్గరకు తీసుక వెళ్ళి టీలు, ఫలహారాలు ఇప్పిచ్చింది.

6

ఫలహారాలు ముగించుకుని, బయటకు వచ్చి, మా కారులో కూర్చున్నాము. ఇక బసకుజేరి జోళ్ళు విప్పేస్తేనేగానీ, అడుగు కింద పెట్టలేక పోతున్నాను. కానీ నా దురదృష్టము కొద్ది యీ తిప్పట చాలదన్నట్టు ఆవూళ్లో వున్న పెద్ద పార్కు - హైడ్ పార్కు అనే ఉద్యానవనానికి తీసుకు వెళ్ళి కొంత సేపు అక్కడే తిప్పింది మా మేనేజరమ్మ.

ఇక్కడ వృక్షజాతులు పుష్పజాతులు, వింతయైన రంగు రంగుల ఆకుల మొక్కలు అనేకములు యెంతో అందముగా అమర్చబడి, అక్కడ అక్కడా కనపడ్డాయి. ఈ పార్కులో విహారానికీ, బళ్ళమీదనూ, గుర్రాల మీదనూ కూడా, గొప్పగొప్ప వాళ్ళందరూ వస్తారట! ఇది పూర్తిగా చూడవలెనంటే ఓపూటో, రెండుపూటలో పడుతుందనిపించింది. యీ వూళ్లో యిన్ని చూడవలసిన ప్రదేశాలు ఉంటే ఒక్కొక్కటి చూడటానికి రోజులు తరబడి పడుతూంటే, ప్రత్యేకముగా యీ లండను నగరము ఈ చివర నుంచి ఆ చివరవరకు చూడటానికే, ఒక సంవత్సరము సరిపోయేటట్టు వున్నదనుకున్నాను. అందుచేతను యింక యీ నగరం సావకాశముగా మరో మాటెప్పుడో చూడవలసినదే ననుకున్నాను. ఈ వూహలతో కాళ్ళీడ్చుకుంటూ నెమ్మదిగా నడుస్తూవుంటే, మా ఆవిడ - పొరపొటు - మామేనేజరమ్మ గారు, నెన్ముదిగా నా దగ్గరకు వచ్చి ఏమి? కష్టముగా ఉన్నదా నాయనా! కాళ్లు నెప్పులు పుడుతున్నాయా? నడవటానికి ఇబ్బందిగా వుందా! నీ ముఖం కూడా, చాలా అలిసిపోయి వాడిపోయినట్లు కనబడుతోంది. పోనీలే యీ పూటకు ఇంతటితో ముగించి ఇంటికి వెడదాము అంది. నా భుజంమీద చెయ్యి వేసి, నా కేసి జాలిగా చూస్తూ,