పుట:బారిష్టర్ పార్వతీశం.pdf/166

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

మొక్కపాటి నరసింహశాస్త్రి

165

బొబ్బిలి పోతు అంతవుంది. కొంత భయంకరముగానే కనపడ్డది. ఇంక తరువాతను పులులూ, సింహాలూ చూశాము. వాటినీ స్వేచ్ఛగా విడిచి పెట్టినా ఎంతో పెద్ద ఆవరణకు చాలా ఎత్తుగా ఇనపబల్లాలతో అడ్డుక ట్టారు. అందులో అవి స్వేచ్ఛగా తిరుగుతుంటాయి. పులిపిల్లలు చిన్నవి కూడా వున్నాయి. అవి చాలాముద్దుగా ఉన్నాయి. సింహాలూ దర్జాగానూ భయంకరముగాను ఉన్నాయి. కాని ఇంత అందముగా కనపడలేదు. కొన్ని చిరుతపులులూ ఉన్నాయి. అవి చాలా అందముగా ఉన్నాయి. ఇంకా యిలాంటి జంతువులు ఎన్నెన్నో కనపడ్డాయి, తరువాత మేము జంతుజాలాన్ని విడిచి పెట్టి పక్షిజాతిని చూడటానికి వెళ్ళాము. ఈ పక్షిజాతిలో యెన్ని రకాలో! యెన్ని రంగులో? యెన్ని రూపాలో యెన్ని ధ్వనులో వర్ణించడానికి శక్యముకాకుండా వుంది.

వీటిలో మనకు పరిచయమైన కాకులూ, గ్రద్దలూ, కొంగలు, చిరుతలు వున్నాయి. ఈ చిలకలలో యెర్రని చిలకలు కూడా వున్నాయి. ఒక రకము చిలక, మనమామూలు చిలకల కంటే, సుమారు పది రెట్లు ఉంటుంది. దానితోక మూడు నాలుగు అడుగుల పొడుగు వుంటుంది. అది జపాను నుంచో! యెక్కడ నుంచో, వచ్చినదన్నారు. ఆ తరువాత పక్షి జాతికంతకీ అలంకారమూ, అందమూ తెచ్చిన నెమళ్ళు కనబడ్డాయి. వీనికంటే చిత్రం, మనము యెన్నడూ కనీవినీ యెరగని నిప్పుకోళ్లు కనపడ్డాయి. అవి బాగా యెత్తుగా ఉంటాయి. బలిష్టంగానూ ఉంటాయి. వేడి వేడి మండుతున్న బొగ్గులు కూడా తింటాయట. వాటి రెక్కలలో వుండే యీకలు, చాలా అందముగా ఉంటాయనీ అక్కడే స్త్రీలు వాటిని తమ టోపీలు వగైరా అలంకరణకు ఉపయోగిస్తారని చెప్పాడు. మాతో ఉన్న మనిషి,

ఇంక మనదేశములో, హిమవత్పర్వతాలలో ఉంటాయనుకునే హంసలు, అనేక రకాల బాతులు, కొంగలు కనపడ్డాయి. బర్మా నుంచి కాబోలు, వచ్చిన తెల్లని చిలకలు కనపడ్డాయి. ఇలా ప్రపంచములో యెన్ని వందల రకాల పక్షులనో తీసుకువచ్చి, మన ఆనందముకోసమూ, విజ్ఞానము కోసమూ ఇక్కడ బంధించి అట్టే పెట్టారు. అసలన్ని రకాలు ఉన్నాయని యెలా తెలుసుకున్నారో! వాటి నన్నిటినీ యెలా పట్టుకు తీసుకురాగలిగారో నాకు చాలా ఆశ్చర్యము వేసింది. ఇంకా ఏవేవో ఇలా చూస్తూ, హఠాత్తుగా ఒక పెద్దహాలులాంటి దానిలోకి ప్రవేశించాము. దాని నిండా బీరువాలలో తీగల తలుపుల వెనకాల, రకరకాల పాములు కనపడ్డాయి. వాటిలో కూడా ఇన్ని రకాలు ఉన్నవని యేప్పుడూ ఎరగను నేను. వినలేదు. కూడాను.