పుట:బారిష్టర్ పార్వతీశం.pdf/165

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

164

బారిష్టరు పార్వతీశం

దగ్గరలోనే అలంకరించుకోవడానికి స్త్రీల కేర్పాటైన ఒక గదిలోనికి తీసుకుని వెళ్ళాడు ఆమెను. చూస్తే యెంతో జాలి వేసింది. నాకు ఆ కోతి కొంటెతనము చూస్తే నవ్వు వచ్చింది. అందుకనే కాబోలు యిళ్ళల్లో అల్లరి చేస్తూంటే కోతి గుణాలు, అంటుంటారు. అనుకున్నాను.

ఆ తరువాతను నేననుకున్నట్లుగానే కొన్ని ఏనుగులు ఉన్నాయి. అక్కడ సర్కసులోకి మల్లేనే మచ్చిక చేసిన ఏనుగులు రెండు మూడిటిని తీసుకువచ్చి పిల్లలను వాటి మీద ఎక్కించి తిప్పి తీసుకు వస్తున్నారు అక్కడ ఉన్న కాపలా వాళ్లు. వాటికి యే అడ్డూ లేకుండా ఆరు బయటనే స్వేచ్ఛగా తిరుగుతున్నాయి. అంత జంతువూ చాలా నిరపాయమైనదట. ఎవ్వరినీ ఏమీ చెయ్యదు. ఎవ్వరు ఏది యిచ్చినా తొండముతో తీసుకుని నోట్లో వేసుకుంటుంది. అక్కడ ఎక్కువ సేపు నిలబడవలసిన అవసరము లేకపోయింది. ఆ పక్కనే లొట్టిపిట్టలూ కనపడ్డాయి. వాటిని బొమ్మలలోనే గాని ఇదివరకెప్పుడూ చూడలేదు. వాటి పొడుగాటి మెడలూ, మూపురాలూ, ఆ ముఖాలూ. చూస్తే మొత్తముమీద జంతుకోటి కంత లోకి యిదే అందవికారమైన జంతువు అనిపించింది.

అక్కడ నిలబడలేకపోయాను నేను. ఇంకొక పదిబారలు ముందుకు వెళ్ళేసరిగి ఆఫ్రికా దేశమునుంచి వచ్చిన మరో చిత్రమైన జంతువు జిరాఫీ కనబడ్డది. దాని పొడుగాటి కాళ్ళూ, కుదిమట్టమైన శరీరమూ, ఒక రకముగా బాగానేవుంది గాని, దానిమెడ యెంత పొడుగో చెప్పలేను. తాటి చెట్టు చిగురు కూడా అమాంతము అందుకోగలదని అనుకున్నాను. ఇది ఆకూ అలమూ తింటూ, బ్రతుకుతుందట. అందుకనీ ఎంత ఎత్తయిన కొమ్మలనూ అందుకొని భుక్తి గడుపు కోవడానికి సృష్టికర్త చేసిన యేర్పాటు అని మాతో వస్తూవున్న నౌకరు చెప్పాడు. అంత పొడుగు మెడవున్నా చూడ్డానికి కొంత ముచ్చటగానే వుంది. దాని ముఖం లేడి ముఖంలాగా ఎంతో అమాయకముగానూ, భీరువుగానూ కనపడ్డది. రెండు నిముషాలు దగ్గర నిలుచుని మా వాళ్ళను అనుసరించి ఇంకొంచెం ముందుకు వెళ్ళాను. అక్కడ పెద్ద బావీ దానిచుట్టూ ఎత్తయినగోడ, అందులో ఒక జంతువు కనపడ్డది. దాని ఖడ్గమృగమన్నారు. దాని ముక్కు మీద బలిష్టమైన కొమ్ము కనపడ్డది. దానిఖడ్గమట అది. ఎటువంటి శత్రువు ఎదురుపడ్డా ఆకొమ్ముతో చీల్చేస్తుందట అది. దాని చర్మము కూడా ఇనుప రేకులా ఎంతో దళసరి. బల్లెము కూడా దూరేటట్లు లేదు. అది కొంత సేపు నీళ్ళలోనూ కొంత సేపు నేలమీదా తిరుగుతుందట. ఇదీ ఆఫ్రికా దేశమునుంచే వచ్చిందని విన్నాను మన వేపున కనపడే పెద్ద