పుట:బారిష్టర్ పార్వతీశం.pdf/163

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

162

బారిష్టరు పార్వతీశం

తరువాత కొంచెం జాలిగాను చూసి “యే జంతువుకు తగిన, అవసరమైన రక్షణ శక్తిని వాటికి తగ్గ రీతిగా దైవం ఏర్పాటు చేస్తాడు” అన్నాడు. మా మానేజరమ్మగారి ముఖంలో మందహాసము కనిపించింది. మేము ముందుకు సాగాము.

ఇక కోతులూ, కొండముచ్చులూ ఉండేచోటుకు వెళ్ళాము. చిన్నా, పెద్దా కొన్ని వందల రకాలు కిచకిచలాడుతూ, పళ్ళు యికిలిస్తూ, మాకేసి తమాషాగా చూస్తూ, యెగురుతూ వూచలు పట్టుకుని పైకి యెక్కుతూ, మళ్ళీ కిందకు దిగుతూ, వాటిలో అవి ఆడుకుంటూ, ఎంతో తమాషాగా కనబడ్డాయి. యితరచోట్ల అన్నిటికంటే, ఈ కోతులదగ్గరే జనము ఎక్కువగా మూగారు. వచ్చిన వాళ్ళందరూ ఆడా, మగా, పిన్నా, పెద్దా అందరూ కూడా పోటీకోసమని ఏవేవో కాయలూ, గింజలూ, పళ్ళూ కొని కూడా తెచ్చుకున్నారు. అవి లోపలికి వేస్తూంటే వాటిలో అవి దెబ్బలాడుకుంటూ ఒకదానిచేతిలోది మరొకటి లాక్కుంటూ, తింటూ మమ్మల్ని చూచి పళ్ళికిలిస్తూ, మరికొన్ని యిమ్మనీ చేతులు ఊపుతూ ఉంటే, ఎంతో వింతగానూ, సంతోషముగానూ వున్నది. వచ్చిన వాళ్ళెవళ్ళూ ఓ పట్టాన కదలి పోవడము లేదు. కొందరు ఆడవాళ్ళు, పిల్లలు, ఈ పళ్లు వగైరా తమచేతిలో వాటిని, వాటికి అందించి, అవి తీసుకుంటూంటే సంతోషిస్తూ ఆడుకుంటున్నారు. ఒక అమ్మాయి చెయ్యి జాపి అది అందుకో బోతుంటే దాన్ని ఏడిపించటానికీ చటుక్కున చెయ్యి వెనక్కు లాక్కుంది. అది కోపంగా చూస్తూ ఊరుకుంది. ఈ అమ్మాయి రెండవసారి వూరుకోక మళ్ళీ చెయ్యి చాపింది. రెప్పపాటులో ఆకోతి, ఈఅమ్మాయి మొర్రోమనీ అరుస్తూ వుంటే, అదీ పళ్ళికిలిస్తూ చెయ్యి విడిచి పెట్టలేదు. ఇంతలోనే అక్కడ నౌకరు వచ్చి ఆ కోతిని మందలించి, కొడతానని బెదిరించే సరికి అది విడిచి పెట్టింది. ఈ గందరగోళము చూడటానికీ జనము చాలామంది గుమిగూడారు. వాళ్ళల్లో వాళ్లు నవ్వుకున్నారు. ఈ అమ్మాయికే సానుభూతి చూపించారు కొందరు. కొందరు వెళ్ళిపోతూ ఉన్నా, మరికొందరు స్త్రీలు అక్కడే నిలబడి, లోకా భిరామాయణము చెప్పుకుంటున్నారు. పంజరానికి దగ్గరలో ఒక లావాటీ మనిషి - కొంచెం వయస్సు మళ్ళినదే తలా, చేతులు వూపుతూ ఏదో ఉత్సాహంగా కబుర్లు చెపుతోంది. మేమింకా ముందుకు వెళ్ళబోమని బయలు దేరాము పంజరం వూచలు పట్టుకొని లోపల వున్న ఒక కోతి చాలో సేపటి నుంచి ఈవిడ అభినయము చూస్తూ ఉపన్యాసము వింటూ పళ్ళికలూస్తూన్నది. ఈవిడ సంభాషణ హడావిడిలో చూసుకోకుండా తనకు