పుట:బారిష్టర్ పార్వతీశం.pdf/162

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

మొక్కపాటి నరసింహశాస్త్రి

161

యివి లేనేలేవు అసలు - అక్కడ లేళ్లు, దుప్పులు, కొన్నిరకాల గుర్రాలు, కొన్ని రకాల కంచర గాడిదలు, ఆఫ్రికానుంచి వచ్చాయట. అవేవో జీబ్రాలట గుర్రాల లాగనే వున్నాయి. యెటొచ్చీ ఒంటినిండా పెద్దచారలు పెద్దపులి చారలు లాటివీ - కావడం పెద్దపులిని నేను చూడలేదుగాని, పెద్దపులికి చారలుంటాయనీ పెద్దలుచెప్పడం, అదీకాకుండా, మావూళ్ళో పీర్ల పండుగలో పెద్దపులి వేషాలు వేసేవాళ్ళు, ఈ చారలు వేసుకో వడం ప్రత్యక్షంగా చూశాను. అక్కడే చారలున్న గుర్రాలలాంటి జీబ్రాలు, చాలా అందముగా కనపడ్డాయి. యింటికి వెళ్ళిన తరువాతను అవసరమైతే ఆఫ్రికా మీదుగా వెళ్ళి ఓ జత జీబ్రాలు కొనుక్కుని రెండుగుర్రాలు బండి లాంటి దానికీ, వీట్లని కట్టి, ఏ మెడ్రాసో తీసుకువెళ్ళినా, జనము అంతా విరగబడి చూసి సంతోషిస్తారు. యేమైనాసరే, వాట్లను తీసుకు వెళ్ళాలసినదే ననుకున్నాను.

పందులు దేశవాళివీ, అడవి పందులూ, ఇవికూడా, మామూలు వాటిలా ఉన్నా నోట్లో పైకి కనపడుతూ రెండు పెద్దకోరలతో ఉన్నాయి. వీటికంటే చాలా చిత్రమైనది, అందమైనది భయంకర మైనదీ. పందిజాతి కంతకీ శిరోభూషణమైనది, ఆ జాతికంతలోనూ చిన్నదీ, ముళ్ళపంది. కనపడ్డది! ఏమిచిత్రంగా ఉన్నది! దాని ఒంటినిండా, నలుపు, తెలుగు రంగులో, ఆరంగుళాలో, ఏడంగుళాలో, పొడవుగల వాడియైన ముళ్ళు సూది మోపడానికి వీలులేకుండా శరీరం నిండా ఉన్నాయి. ముఖం మీద తప్ప, ఇవన్నీ పుట్టుకతో వుంటాయా, లేకపోతే, తరువాతను ఎలా మొలుస్తాయా, లేకపోతే చూచే వాళ్ళను గమ్మత్తు చెయ్యడానికి ప్రదర్శనశాల వాళ్ళు ఈ ముళ్ళ తొడుగు ఏదయినా తొడుగుతారా! అని ఆలోచిస్తుండగా, మాతో కూడా ఉన్న ప్రదర్శనశాల తాలూకు మనిషి కటకటాల మధ్యనుంచి కర్రతో ఒక దానిని పొడిచాడు. దానికి ఒళ్ళుమండి, “అమ్మ వెధవా! ఉండూ నీ పనీ చెబుతాను” అన్నట్లు ఒక విధమైన శబ్దముచేసి, వాడి మీదకీ ఉరక బోయింది. చిత్రమేమిటంటే, ఆ క్షణములో మనకు గరిపొడిచి నప్పుడు, మనశరీరము మీద రోమములు నిలబడినట్లు ఈ పంది మీద ముళ్ళన్నీ నీ టాక్కున లేచాయి. ఆస్థితిలో, యిది ఎవరి మీదనైనా పడితే యింకేమైనా ఉందా అని అనుకుంటూ ఉంటే అప్పుడామనిషి ఉపన్యాస ధోరణిలో వీని సంగతి అంతా చెప్పుకు వచ్చాడు. శత్రు బారినుండి తప్పించుకుని బయట పడడానికి, ఆత్మ సంరక్షణ కోసము, పరమాత్ముని మహా ప్రసాదం యిది అని నా కేసి తిరిగాడు. నేను అనాలోచితంగా, మరీ తక్కిన జంతువులకో అన్నాను. వాడొక్కసారి నాకేసి, తీక్షణంగాను,