పుట:బారిష్టర్ పార్వతీశం.pdf/160

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

మొక్కపాటి నరసింహశాస్త్రి

159

ఆమె కరచాలనకు చేయి జాపి, మిమ్మల్ని కలుసుకోవటము చాలా సంతోషం. మీకు తొందర పనిలేకపోతే, ఇంకొక నాలుగురోజులున్నా యిబ్బంది లేదు. ఈ వూరు అందాలన్నీ చూడవచ్చు, లేక ఇక్కడనే వుండి చదువుకున్నా చదువుకోవచ్చును. అంది. నా స్నేహితుడు, ఆమె దగ్గర సెలవు తీసుకుని వెళ్ళిపోయాడు. ఆమె నన్ను కూర్చోమనీ, నా ఊరూ, పేరూ అన్నీ అడిగింది. మరో రెండు నిముషాల ఆ మాటా, ఈ మాటిచెప్పి మధ్యాహ్నం భోజనము కాగానే, జంతు ప్రదర్శనశాలకు కొందరు మిత్రులు, మీ దేశము నుంచి కొత్తగా వచ్చిన వారిని తీసుకు వెళ్ళాలను కుంటున్నాను. నీవు కూడా వస్తావా అని అడిగింది. “తప్ప కుండా, సంతోషంతో వస్తా” నన్నాను. “అయితే రెండు గంటలకు కలుసుకుందాం” అన్నది. నేను లేచి, గుడ్ మార్నింగ్ చెప్పి, నా గదికి వచ్చేశాను.

5

నేను మధ్యాహ్నం భోజనం ముగించుకొని, యెప్పుడు రమ్మని పిలుస్తారో అని, ఒంటిగంటన్నర కల్లా సిద్ధమై కూర్చున్నాను. జంతు ప్రదర్శనశాల యేమిటి? యిలాటిది యెందుకు యేర్పాటు చేశారు? అది చూసేదేమిటి? యెక్కడబడితే అక్కడ మనకు అన్ని రకాల జంతువులూ కంటికీ, కాలికీ తగులుతూనే వుంటాయికదా! యిందులో యేమైనా పులులూ, సింహాలూ, సర్కసులోకి మల్లే వుంటాయా! అని ఆలోచిస్తూ, కూర్చుండగా సరిగ్గా రెండు నిమిషాలు వుందనగా, బయటి వెళ్ళడానికి సిద్ధంగా వుంటే రమ్మనమని ఒకమనిషి వచ్చి చెప్పాడు. నేను రెడీయే అంటూ లేచి, అతని వెనుక బయటికి వచ్చాను. ముందు హాలులో పదిపది హేనుగురు మన దేశస్థులు, నాకంటే కొద్దిగా పెద్దవారు, అక్కడ నిలబడి వున్నారు. వాళ్ళ మొహాల కేసి చూస్తే అందులో ఒక్కడూ తెలుగువాడి లాగా కనబడలేదు నేనా ముఖపరీక్ష చేస్తూండగానే, గడియారము రెండు కొడుతూ వుండగా, వుదయము నాతో మాట్లాడిన మేనేజరు అమ్మ గారు డ్రెస్సు వేసుకుని నెత్తిమీద యేవో రకమైన యీకలు వున్న టోపి ధరించి, పైన పాదాల వరకూ వుండే పెద్ద కోటు తొడుక్కుని. చేతిలో కర్ర పుచ్చుకుని, ప్రవేశించింది. ఆ కోటు చూసిన తరువాతను యిలాటిది అందరూ వేసుకోవాలి కాబోలు అనుకున్నాను. నేను తక్కినవాళ్ళను కూడా చూస్తే వాళ్ళందరూ కూడా తొడుక్కునే వున్నారు. అందరి