పుట:బారిష్టర్ పార్వతీశం.pdf/159

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

158

బారిష్టరు పార్వతీశం

చదువుతో ఆగిపోయాను. ఇంక నేనేమి చేయాలో చెప్పండి అన్నాను.

“బాగుంది, చాలా సంతోషం, నీవు అన్నమాట, నీవు చేసిన పని, దాపరికము లేకుండా చెప్పావు నన్ను నమ్మి. నిన్ను చూస్తే, చాలా పసివాడవనీ, అమాయకుడవని తెలిసింది. నీమీద నాకొక సోదరభావము కలిగింది. నీవు ఇలాంటిచోట్ల, నెగ్గుకురావడం కష్టము. స్కాట్ లాండ్ లో ఎడింబరో పట్టణమునకు నువ్వు వెడితే, అక్కడ వుండి చదువుకోవచ్చును. అక్కడ ఉండడానికి, ఇక్కడి కంటే, సుఖంగా ఉంటుంది. డబ్బు చాలా తక్కువ అవుతుంది. మన దేశస్థులు, చాలామందే ఉన్నారక్కడ. ఊరు ఇంతకంటే, చాలా చిన్నది కావడము మూలాన, తరుచు మన వాళ్ళందరునూ కలుసుకునే అవకాశము ఎక్కువ ఉంటుంది. నీవు హైస్కూలు చదువుతో ఇంటి దగ్గర ముగించానన్నావు కనుక, ఇక్కడ ఎంట్రన్స్ పరీక్షకు కూర్చోవలసి ఉంటుంది. మూడు నాలుగు మాసములు అక్కడే ఎవరిచేతనో ప్రైవేటు చెప్పించుకుని పరీక్షకు వెళ్ళవచ్చును. ఆ తరువాత నీవనుకున్న బారిష్టరు పరీక్షకు చదవచ్చును. నీకు ఓపిక ఉంటే, ఎం.ఏ పరీక్షకు కూడా ఏక కాలమందు చదవవచ్చును. ఏమంటావు?” అన్నాడతను “నేను అనడానికీ ఏమీ ఉన్నది? మీరేమి చెప్పినా, దానికి తధాస్తు అనడమే నా పని” అన్నాను.

అయితే, ఈ వేళ నేను నీతో రావడానికి తీరుబడి లేదు. ఈ ఇండియా హౌస్ సంస్థను నడపడానికీ, ఇక్కడ ఒకావిడ మేనేజరుగా ఉన్నది. ఆమె మధ్యాహ్నము నీవలె కొత్తగా వచ్చిన వాళ్ళను కొందరిని జంతు ప్రదర్శన శాలకు తీసుకువెళ్ళవలెనని అనుకుంటున్నది, నిన్ను ఆమెకు పరిచయము చేస్తానిప్పుడు. ఆమెతో కూడా వెళ్ళు. మీరు సాయంత్రము నాలుగైదు గంటలకు ఇక్కడకు తిరిగి వస్తారు. అప్పటికి నేను రావడానికి ప్రయత్నము చేస్తాను. మనం ఇప్పుడు ఫలహారము ముగించి ఆవిడను కలసుకుందాము. ఆ తరువాతను నా దారిన నేను వెళ్ళుతాను. అటూ, భోజనశాల వైపు దారితీశాడు. అక్కడ మా పని ముగించుకుని, ఆ మేనేజరు దగ్గరకు వెళ్ళాము. ఆమె నవ్వుతూ ముమ్మల్ని ఆహ్వానము చేసినా, ఆమెను చూస్తే మట్టుకు నాకు కొంచెము భయ మనిపించింది. గుండె ఒక్కసారి దడదడలాడింది. ఆమె సుమారు ఏభయ్యేళ్ళవయస్సు మనిషి. బాగా లావుగా, పొడుగ్గా, గంభీరముగా కనపడ్డది, నా స్నేహితుడు, నేను ఫలానా అనీ, నిన్న రాత్రే కొత్తగా వచ్చాననీ, ఇవాళో రేపో వెళ్ళిపోతాననీ, పరిచయము చేశాడు.