పుట:బారిష్టర్ పార్వతీశం.pdf/158

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

మొక్కపాటి నరసింహశాస్త్రి

157

మీదకు వచ్చాము. “ఏమండీ, ఈ పూటకు ఈ పర్యటన ముగించి, బసకు చేరుకుందామా.” అన్నాడు, మా స్నేహితుడు. అదే మంచిదన్నాను రోజంతా ట్రాములో కూర్చున్నా, కొంచెము శరీరానికి ఇబ్బందే కలిగింది. బసకు చేరుకుని, ఆ పూటకు భోజనాదికములు ముగించుకొని, గుడ్ నైట్ చెప్పుకుని, యెవరి గదికి వారు చేరుకున్నాము. నాగదిలో బట్టలు మార్చుకుని, సుఖంగా పడుకుని, నాటి దినచర్య అంతా ఒకమాటు సమీక్ష చేసుకుని నా స్నేహితుడు యెంత మంచివాడు! తెలుగువాడైనవాడు నన్ను పలకరించనైనా లేదే! ఇతడు పాపము నామీద దయతలచి, ఒక రోజు అంతా నాతో తిరిగి, తనకు ఏ ఇబ్బంది లేనట్టు, కాలక్షేపం చేశాడు. మన వాళ్ళు కూడా ఇలా యెందుకుండలేరో, అనుకుంటూ నాకు తెలియకుండానే ఏరు దాటాను. అనగా నిద్రాదేవత వడిలోనికి ఒరిగానన్నమాట.

ఉదయం లేచి నా నిత్యకృత్యములన్నీ తీర్చుకుని, డ్రెస్సు వేసుకునేసరికి. మా "స్నేహితుడు మీనన్ మళ్ళీ వచ్చాడు. నవ్వుతూ గుడ్ మార్నింగ్ చెప్పి కూర్చుని, నీకు రాత్రి బాగా నిద్రపట్టిందా! అని, ఏమీ అలసటగా లేదుకదా! అని, యోగక్షేమం కనుక్కున్నాడు. “మీరీ వేళ ఉంటారా? ఇక్కడనుంచి యెక్కడకు వెళ్ళుతారు? మీరు ఏర్పాటు చేసుకున్న కార్య క్రమం ఏమిటి?” అన్నాడు. నాకు యే యేర్పాటూ లేదనీ యేం చేయాలో తోచటంలేదనీ, ఇంటిదగ్గర ఏమీ ఆలోచించకుండా, యే నిర్ణయాలూ చేసుకోకుండా, యెవరితో చెప్పకుండా వచ్చాననీ, నా రహస్యం బయట పెట్టాను. అతను నవ్వి, “నీ వాలకం చూస్తే, ఇలాటి పని యేదో చేశావనీ ఊహించానులే నీలాటివాళ్ళు మీ ప్రాంతం నుంచి, ఇప్పుడిప్పుడే రావడము మొదలు పెట్టారు. అయితే నీవు యేమి చదువుదామని అనుకుని వచ్చావు? - డబ్బు సరిపడ్డవున్నదా? మీవాళ్ళు పంపిస్తారా! లేకపోతే ఇక్కడినుంచి వెనక్కి వెళ్ళిపోతావా?” అన్నాడు.

నేను కొలంబో నుంచి, మావాళ్ళుకు ఉత్తరం రాశాననీ, వాళ్ళు నాకు మార్సేల్స్ కు డబ్బు పంపించారనీ నన్ను ఇంటికి రమ్మని బ్రతిమాలుతూ, ఉత్తరం రాశారని, కానీ, అలా వెళ్ళిపోవడం నాకెంత మాత్రమూ ఇష్టం లేదనీ, ఎలానో శ్రమపడి మా వాళ్ళు డబ్బు పంపించగలరనీ, అందుచేత ఎక్కడో ఒకచోట, చదువులో ప్రవేశించాలని నా నిర్ణయమనీ చెప్పాను. నేను ఎక్కడ చేరితే బాగుంటుందో, ఎక్కువ ఖర్చుకాకుండా ఉంటుందో, నేనక్కడకు ఎలా వెళ్ళేలో మీ సలహా ఇస్తే సంతోషిస్తాను, నాకు బారిష్టరు పరీక్షకు చదవాలని ఉన్నది. నేను ఇంటి దగ్గర, హైస్కూలు