పుట:బారిష్టర్ పార్వతీశం.pdf/157

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

156

బారిష్టరు పార్వతీశం

చూపించి, మేము కూర్చోవలసిన చోటు చూపించాడు, మేము కూర్చున్నాము. మా ప్రక్కన ఎవరున్నారో, లోపల ఎంతమంది వున్నారో ఏమీ కనపడలేదు. మాకు ఎదురుగా ఒక పెద్ద తెర తెల్లనిది దానిమీదను స్త్రీ, పురుష ఛాయలు హావభావములతో కదిలిపోతున్నాయి. కొంత సేపటికి ఇది ఒక నాటకము, ఈ రూములో ప్రదర్శితమవుతున్నదని తెలుసుకున్నాను.

ఆశ్చర్యచకితుణ్ణి అయినాను. ఓ మాటా మంతీ లేకుండా, ఏ శబ్దమూ వినపడకుండా, మనిషీ కనపడకుండా, ఆ మనుష్యుల నీడతోనే సుమారు రెండు గంటల సేపు మనకు నాటకము ప్రదర్శించగలిగారంటే, ఎంతో అద్భుతము అనిపించింది. ఏమనడానికి మాటలు కనబడలేదు, మధ్యను మట్టుకు ఒకటి రెండుసారులు వెలుతురు వచ్చింది. ప్రదర్శనశాల అంతా కనపడ్డది. అది చాలా పెద్దది. అధమషక్షం, వెయ్యిమంది పైగా స్త్రీ, పురుషాదులంతా కూర్చొని వున్నారు. ఇందులో తరతమ బేధము ఉన్నదేమో, అప్పుడు తెలియలేదు. ఇంతమందినీ ఏ అల్లరీ లేకుండా, ఈ ఛాయా నాటకం ఆకట్టుకోగలిగిందంటే, ప్రదర్శకులు ఎంత ప్రజ్ఞావంతులో అనిపించింది. మేము నాటకము చూడటము పూర్తికాగానే, నెమ్మదిగా లేచి, బయటకు వచ్చాము. తెరమీద ప్రదర్శన సాగుతూనే వుంది. వచ్చేవాళ్లు వస్తూనే ఉన్నారు. వెళ్లేవాళ్లు వెళుతూనే ఉన్నారు. మన వూళ్లోకి మల్లే నాటకం పూర్తి కావడం, జనం పెద్దగోల చేసుకుంటూ ఒకళ్ళ నొకళ్లు తోసుకుంటూ బయటకు రావటం పద్ధతి లేదు ఇక్కడ. ఒక ప్రదర్శనం కావడం తోటే, ఆపకుండా మళ్ళీ ఒక ప్రదర్శన ప్రారంభము అవుతుంది. అందుచేత ఎవరికి తీరిక అయినప్పుడు వారు వచ్చి లోపల కూర్చొని, వారు ఏ రంగము దగ్గర నుంచి ప్రదర్శన చూశారో, మళ్ళీ ఆ రంగము వచ్చేవరకూ కూర్చుని బయటకు వెళ్ళిపోతారు. అంతేగాని, మొదటినుంచీ దుళ్ళీ చూదామని ఎవ్వరూ అక్కడ కూర్చుండిపోరు. ప్రదర్శన జరుగుతున్నం తసేపూ హాలంతా ఎంతో నిశ్శబ్దము, మన దేశములో ఇలా వుండడము సాధ్యమా! న్యాయముగా తమరు చూడడము అయిపోవడము తోటే మన వాళ్ళు బయటకు వెళ్ళిపోతారనీ, కొత్తగా వచ్చిన వాళ్ళకు చోటు ఇస్తారనీ, నేను నమ్మలేకపోయాను. వెంటనే వెళ్ళకపోతే మట్టుకు అడిగేవాడెవడు మనను! నాటకము బాగుంటే మరోమాటు చూడవచ్చుకదా! ఇంతమందిలో మననెవరూ అనమాలు పట్టలేరు కదా! నాటకశాల యజమానికి ఇంతట్లో పోయేదేముంది అనుకునే స్వభావము మనది అనుకుంటాను.

అప్పటికి, సుమారు రాత్రి యెనిమిది గంటలవుతుంది. మేము రోడ్డు