పుట:బారిష్టర్ పార్వతీశం.pdf/156

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

మొక్కపాటి నరసింహశాస్త్రి

155

దుకాణములోనికి వెళ్ళి ఆయజమానిని ఇదేంపని అని మందలిద్దామని కూడా అనుకున్నాను. సిగ్గులేదా అని నాలుగూ దులిపేద్దామనుకున్నాను. ఇంతలోకే ఆ కొట్లు దాటిపోయాయి. ఆ దృశ్యం మరుగుపడగానే, నా ఆవేశము తగ్గి అదేం మన వూరా! మన దేశమా! మనం చెబితే వాళ్ళు వింటారా? అనే ఆలోచన తోచి “నయము తొందరపడి గొడవపడ్డాను కాను” అనుకొని సంతోషించాను.

తరువాతను ‘Trafalgarsquare’ అని ఓ ప్రదేశం, అందులో మధ్యను నెల్సన్ శిలా ప్రతిమ చూపించాడు. ఆ తరువాతను ఏదో పికడల్లీ సర్కన్ అన్నాడు. అయితే ఇక్కడకూడా సర్కస్ కంపెనీలు ఉంటాయా అన్నాను. ఉంటే చూడవచ్చనే ఉద్దేశంతో అతను నవ్వి, “మనకు వీథిలో కనబడే జంతువులు తప్ప, మరో జంతువులుండే సర్కస్ కంపెనీలు ఏమీ లేవిక్కడ.” ఈ ప్రదేశం పేరు సర్కస్ అంటారు. ఆ పేరెందుకొచ్చిందో మట్టుకు నాకు తెలియదన్నాడు.

4

అప్పటికి సాయంత్రం నాలుగ్గంటలవుతుంది. మళ్ళీ ఒకచోట ట్రాము దిగుదామన్నాడు. మీనన్ నన్ను దింపి, దగ్గరున్న మరో చిన్న హోటలుకు తీసుకు వెళ్ళి, అక్కడా మళ్ళీ, టీ, ఫలహారాలూ, వగైరా ఏర్పాటుచేశాడు. ఫలహారాలంటే, మనకు పకోడీలూ, పుణుకులూ, మిఠాయి వుండల వంటివి లేవు, రొట్టె దానికి అనుపానం వెన్న, పండ్లతో తయారయిన అదేదో “జామ్”ట అదీ, కొన్ని తియ్యని కేకులూను, యివీ ఫలహారవ స్తువులు.

లఘువుగా ఫలహారం కానిచ్చి మళ్ళీ బయటపడ్డాము. ఈసారి ట్రాం ఎక్కకుండా కొంతదూరము షాపుల కేసి చూస్తూ, ఎంతో ఆనందముతో నడిచాము. అక్కడ ఒక పిక్చర్ హౌస్ అనేది ఉన్నది. అక్కడ నా మిత్రుడు ఆగాడు. పైన పెద్ద పెద్ద అట్టలమీద, చిత్రమైన స్త్రీ, పురుషుల బొమ్మలు కనబడ్డాయి. “యిదేమి”టన్నాను. “రండి లోపలకు పోదాము యిది చూపించడానికే, మిమ్మల్ని యిక్కడికి తీసుకువచ్చాను. లోపల ఒక తెర మీద కదిలే బొమ్మల నాటకం మనకు కనిపిస్తుంది. చాలా బాగుంటుంది.” అని లోపలకు దారితీసి, చెరొక టిక్కెట్టుకొని, లోపలికి తీసుకు వెళ్ళాడు. లోపలంతా చీకటిగా వున్నది. ఒకతను మాకు దీపము