పుట:బారిష్టర్ పార్వతీశం.pdf/155

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

154

బారిష్టరు పార్వతీశం

“ఇది శాకాహారమేనా యేమిటీ?” అన్నాను. “ఔనండి, అందులోనూ చాలా ప్రశస్తమైనది” అన్నాడు. “ఇదీ నాకు వ”ద్దన్నాను.

“మరింకా శాకాహార మంటే ఏమిటండీ సార్ అన్నాడు.

“చేపా పనికిరాక, గ్రుడ్డూ తినక మరింకేం తింటారండి సార్” అన్నాడు. అప్పుడు మా స్నేహితుడు కలుగజేసుకుని “వారికి కొంచెం అన్నం బంగాళ దుంపకాని, కాబేజీకాని, అలాంటిదేదైనా మరొకటి తీసు కురా” అన్నాడు. ఆ మాటలు విని వాడు నిర్ఘాంతపోయి ఇలాటిది తిని వీళ్ళెలా బ్రతుకుతారా, అనుకున్నాడు కాబోలు నా కేసి ఒకసారి జాలిగా చూసి “ఈ వరసేమీ బాగాలేద”న్నట్లు తల ఇటూ, అటూ వూపి, రెండు నిముషాలలో ఒక ప్లేటులో గుప్పెడు అన్నమూ ఇంకో రెండు ప్లేట్లలో రెండు కూరలూ, తీసుక వచ్చి నా ఎదుట పెట్టాడు. బ్రతుకు జీవుడా అనుకుని “కాలే కడుపుకి దక్కిందే కబళం” అన్నట్లు అదితిన్నాను. వెంటనే ఆ ప్లేటు తీసుకుపోయి యింకొక ప్లేటులో చిక్కని సగ్గుబియ్యం పరమాన్నమూ పాలూ, తీసుకు వచ్చి మా కుభయులకూ అందించాడు. పోనీ యిదేనా హితవుగా ఉన్నదనుకుని అది ముగించి, పోనీ మరో ప్లేటు తెమ్మందాం అనుకుంటూంటే, నా స్నేహితుడు నా వూహ గ్రహించి నట్టున్నాడు. అదేమీ వద్దని సంజ్ఞ చేశాడు. మా భోజనం పూర్తి అయ్యి అవకుండానే నౌకరు ఒక ప్లేటులో బిల్లు తీసుకు వచ్చాడు అతను బిల్లు మొత్తం చెల్లించి, అదనంగా రెండుషిల్లింగులు కాబోలు యిచ్చాడు. వాడది సంతోషముతో స్వీకరించి వెళ్ళిపోయాడు. మేము బయటకు వచ్చాము.

అక్కడనుంచి మళ్ళీ మరో ట్రామెక్కీ నగర సంచారానికి ఉపక్రమించాము, చాలా పెద్ద పెద్ద షాపులూ, వ్యాపారసంస్థలు, పత్రికా కార్యాలయాలూ, పుస్తకాల షాపులూ, ఎన్నెన్నో కనబడ్డాయి. ఏ షాపులో చూసినా అక్కడ దొరికే వస్తువులన్నీ ఎంతో ముచ్చటగా అలంకరింపబడి వుంటాయి. కానీ ఒక్కచోట మట్టుకు, చూచిన షాపు భయంకరంగానూ, జుగుప్సాకరంగానూ వుండి, కడుపులో కెలికినట్లయి, వాంతి వచ్చేటంత పనయింది. ఆషాపులో గోవుల కళేబరాలూ, గొర్రె, మేక కళేబరాలూ, పందుల కళేబరాలూ, వగైరా చర్మములు లేకుండా, కడుపుచీల్చి, లోనున్న పేగులు తీసేసి నిలువునా వేళాడుతూ కనపడ్డాయి. తలుచుకుంటే ఇప్పటికీ నాకు ఒళ్ళు గరిపొడుస్తుంది. మాంసము తింటే మటుకు బొమికలు మెడలో వేసుకోవడము ఎందుకు అంటారు మనవాళ్ళు. అలాగా, ఈ భీకర ప్రదర్శనము లేకపోతేనేమా అనుకున్నాను. ఒక్కమాటు దిగి, ఆ