పుట:బారిష్టర్ పార్వతీశం.pdf/154

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

మొక్కపాటి నరసింహశాస్త్రి

153

ఏవో ఒకటి తెప్పించుకోవడం. తిన్న తరువాతను ఎంతయిందీ మనతో చెప్పకుండా వెనకాలే అంజే కాలణా” అని కేక వెయ్యడడం జ్ఞాపకము వచ్చి ఈ యేర్పాటు చాలా బాగున్నదని అనుకుంటూండగా, మా స్నేహితుడి ఎదుట ఒక ప్లేటూ, నా ఎదుట ఒక ప్లేటూ తీసుకువచ్చి ఆ నౌకరు ఉంచాడు. నా ప్లేటు చూసేటప్పటికి నా కంటికి - పొరపాటు - గుప్పున వాసన నా ముక్కుకు తగిలింది. చూసేటప్పటికి చక్కగా పచనమైన మత్స్యావతారము కనబడింది. ఇహను వరసాగ్గా దశావతారాలూ తెస్తాడా యేమిటా అని భయపడుతూ “ఇదేమిట” న్నాను. “చేపండీ” అన్నాడు నౌకరు. “నేను శాకాహారిని కదా?” అన్నాను. “మరి ఇది కూడా శాకాహారము కాదా?” అన్నాడు వాడు. ‘ఇది శాకాహారమేమిటి' అన్నాను. “కాదండి సార్ దాన్ని చంపుతే ఎర్రని రక్తంరాదు. ఎర్రని రక్తం కార్చే జంతువు మాంసమే మాంసాహారమవుతుందని” నిర్వచనం చేశాడు. అయినా సరే, ఇది నాకు పనికిరాదన్నాను. వెంటనే వాడది తీసుకవెళ్ళి ఉడకబెట్టిన కోడిగ్రుడ్డో, బాతుగ్రుడ్డో తీసుకువచ్చాడు. “ఇదేమిటోయి ఈ గాడిద గుడ్లు?” అన్నాను. వాడికి అదేమిటో అర్థంకాక “కోడిగుడ్డండి” అన్నాడు.