పుట:బారిష్టర్ పార్వతీశం.pdf/153

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

152

బారిష్టరు పార్వతీశం

కేసి దీర్ఘంగా చూచి, రెండు నిముషముల వరకూ ఏమీ మాట్లాడలేదు. ఇలాగ సుమారు ఒంటి గంట వరకూ ట్రాములో కూర్చునే ఎన్నో భవనాలు చూచాము. కొన్ని నాటకశాలలు చూశాము. కొన్ని ప్రసిద్ధమైన చర్చీలు చూశాము. కాని, ఎక్కడా దిగడానికీ, ఏదీ పరీక్షగా చూడటానికి వీలు కాలేదు ఒకటొకటే సావకాశంగా చూడాలంటే కొన్ని మాసములుపడుతుంది సుమండీ అని నా స్నేహితుడు చెప్పాడు. అందుచే తను అంతటితో తృప్తి పడక తప్పిందికాదు.

ఒంటి గంట ఎక్కడో కొట్టింది. ఇంకను మనం దిగుదామని నా స్నేహితుడు చెప్పి, నన్ను కిందకు తీసుకు వెళ్ళాడు.

“మీకేమన్నా - ప్రయాసగా వుందా? ఇక్కడెక్కడేనా లఘువుగా భోజనం చేసి మళ్ళీ తిరుగుదామా? లేకపోతే మన బసకు వెళ్ళి అక్కడ భోజనం చేసి కొంచం విశ్రమించి మళ్ళీ వూరు మీద పడదామా!” అన్నాడు నవ్వతూ.

ట్రాములో కూర్చున్నాము కదా ఉదయం నుంచి శ్రమేమున్నది. ఇక్కడెక్కడేనా మీరన్నట్లు భోజనం చేసి మళ్ళీ మన చాంద్రాయణం సాగిద్దాము. రేపెలాగూ నేను వెళ్ళవలె ననుకుంటున్నాను అన్నాను. “సరే రండి అయితేను” అని ఒక చిన్న హోటలుకి దారితీశాము.

మేము వెళ్ళేటప్పటికి కొన్ని వేలమంది ఆ చిన్న హోటల్లో కూర్చున్నట్టు అనిపించింది. ఇంత చిన్న హోటలు అయినా ఇక్కడికి ఇంత మంది వస్తున్నారంటే ఇదొక రకంగా మంచి హోటలే అయివుండాలి అనుకున్నాను. మేము గది నాలుగు మూలలూ తిరిగి ఓ రెండు కుర్చీలు సంపాదించగలిగాము. మేము కుర్చీల మీద పూర్తిగా కూర్చోకుండానే ఒక నౌకరు వచ్చి నాటి వంటలు వ్రాసి ఉన్న కార్డు ఒకటి నా స్నేహితుడి చేతికి అందించాడు. అతను తీసుకుని, తనకు కావలసినది ఏదో పురమాయించి నేను శాకహారిననీ, నా కనుకూలమైన వేవో తీసుకురమ్మనమనీ చెప్పాడు. “ఆ కార్డేమి”టని మా స్నేహితుడిని అడిగాను. అంటే “ప్రతి హోటల్లోనూ అక్కడ లభ్యమయ్యే భోజన పదార్థాల జాబితా ఒకటి అచ్చు వేయించి వుంచుతారని, అక్కడకు వచ్చిన అతిధులకు అందిస్తే, వారికి కావలసినవి చెప్పి తెప్పించుకోవడానికి వీలుగా వుంటుందనీ ఇక్కడీ ఏర్పాటు చేశారనీ, ఏ హోటల్లోనయినా ఇదే పద్ధతనీ చెప్పాడు. మదరాసు హోటల్లో ఏమున్నాయని మనము అడగడమూ, ఇడ్లీ సాంబార్, వడై అని ఎదో పెద్ద గొంతుకతో ఏకరువు పెట్టడం, అవన్నీ మనకు వినపడక |