పుట:బారిష్టర్ పార్వతీశం.pdf/151

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

150

బారిష్టరు పార్వతీశం

వీధిలో అడుగు పెట్టడంతోటే, అప్పటికి పది గంటలేనా కాకపోయినా వీధినిండా, గబగబ నడిచి వెళ్ళే జనం, గుర్రపు బళ్ళూ, మోటారు కారులూ, ట్రాంకారులూ కనబడ్డాయి. ఎంతో సందడీ, హడావిడీని.

ఇక్కడ రోడ్లు మామూలు చదునుగా కాకుండా ఇటికల లాటి రాళ్ళతో తాపటం చెయ్యబడి ఉన్నాయి. అందుచేత బండి గుర్రాల డెక్కల చప్పుళ్ళూ, ట్రాంకార్ల చప్పుళ్ళూ, విశేషంగా చెవులు తడికలు కట్టేటట్టు వినిపించినాయి. నా స్నేహితుడు నాకేసి చూచి, నా ఊహ గ్రహించినట్లు - రెండు మూడు రోజులుంటే ఈ ధ్వనికి మీరూ అలవాటు పడతారులెండి. అన్నాడు నెమ్మదిగా, ఓ ట్రాము దగ్గరకు తీసుకువెళ్ళి ఎక్కించాడు. అక్కడనుంచి, లండను నగర సందర్శనం ప్రారంభించాము.

ఎటు చూసినా నాలుగంతస్తులకు తక్కువలేని మేడలూ, వాటన్నిటికీ వీధివైపు కిటికీలకు పెద్ద పెద్ద అద్దాల తలుపులూ, వాటి వెనుక తెరలు, అందులోంచి తొంగిచూసే జనమూ, కింద భాగాల్లో చాలావరకూ పెద్ద పెద్ద దుకాణాలూ, రోడ్డు కిరువైపులా ఉన్న చప్టాలమీద గబగబా నడిచి వెళ్ళే స్త్రీ, పురుష సందోహం చూస్తూంటే అదో తమాషాగా వుంది, ఆడా, మగా అందరూ కూడా కాళ్ళకు బూట్లు తొడుక్కున్న వాళ్ళే. అందరికీ ఒకటే హడావిడి తెల్లవారే సరికి. ఇన్ని వేల జనం, ఇంత హడావిడిగా ఎక్కడికి పోతుంటారా? అనుకుంటూ కూర్చున్నాను. పక్కనున్న స్నేహితుడు ఏవేవో చెబుతూనే వున్నాడు. కొన్ని తలకు తగులుతున్నాయి. కొన్ని తగలడం లేదు.

ఇంతలో ఊరి మధ్యనుంచి ప్రవహిస్తున్న నదీ దాని మీద వంతెనా కనబడ్డాయి. ‘చూడు, చూడు ఇదే ధేమ్సునది’ అన్నాడు నా స్నేహితుడు. ఈ వంతెనే వాటర్ లూ బ్రిడ్జ్ అన్నాడు. చాలా చరిత్ర ప్రసిద్ధమైనది. ఆ పక్కనున్నవి చిత్రంగా కనబడ్డ పెద్ద భవనం పార్లమెంటు హౌస్ అన్నాడు. ట్రాములో కూర్చుని చూసినా ఎంతో బ్రహ్మాండంగా కనబడ్డది. నది, మన గోదావరిలా పెద్దది కాకపోయినా. ఎంతో ప్రముఖమైనదనీ, ఈ నదీ ముఖంలోనుంచి ప్రపంచవ్యాప్తంగా అందులో ముఖ్యంగా మన దేశానికి మన నిత్యావసరానికి సమస్త సామాగ్రి ఎగుమతి అవుతూ వుంటుందని నామిత్రుడు చెప్పకుపోతున్నాడు. ఈనది, నదిలో ఓడలూ పక్కనున్న పార్లమెంట్ హౌసూ, ఇవన్నీ చిన్నప్పుడు జాగ్రఫీలో చూచిన బొమ్మల్లాగానే వున్నాయి. ఏమీ తేడాలేదు. అతను చెప్పకపోతే, నేనే అడిగేవాడిని. ఇది పార్లమెంటు కాదా అని ఇంకా అతనేదో చెప్పకు పోతున్నాడు. నా ఊహ