పుట:బారిష్టర్ పార్వతీశం.pdf/150

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

మొక్కపాటి నరసింహశాస్త్రి

149

నా ఊహ ఇట్టే కని పెట్టినట్టు అన్న ఈ మాటలకు ఎంతో సంతోషించి “మీరు చాలా మంచివారండీ. నేనే మిమ్ములనే ఒకసారి ఊళ్ళోకి తీసుక వెళ్ళమని అడుగుదామనుకుంటున్నాను. నా ఊహ మీరు గ్రహించినట్లు, మీరే తీసుకు వెడతామంటున్నారు. చాలా సంతోషం - అయితే వెంటనే బయలు దేరుదామా” అన్నాను. “లేవండి వెడదాం - మీరొక మాటు తలదువ్వుకోండి, మనం ముందు భోజనాల హాలులోకి వెళ్ళి అక్కడ కొంచెం ఫలహారం చేసి, బయటకు పోదాం” అన్నాడు.

“ఫలహారం ఇప్పుడయింది కదా” అన్నాను అబ్బే ఇది చాలదు లేండి - ఇదీ ఊరికే మన దినచర్యకి ఉత్సాహం కల్పించడం వరకే దాని ప్రయోజనం మరికొంత ఘనంగా, పూటుగా కడుపులో పడితేనే తప్ప, మధ్యాహ్నం మళ్ళీ ఒంటిగంట వరకూ మన బండి నడవదు అంటూ నన్ను భోజనాల హాలులోకి తీసుకు వెళ్ళాడు.

రాత్రి చూచిన హాలే అది. బల్లనిండా పళ్ళాలు, సాసర్లూ, కత్తులూ, కఠార్లూ వగైరా సామానులన్నీ అమర్చివున్నాయి. కొంతమంది అప్పుడే ఫలహారాలు చేస్తున్నారు. నిన్న రాత్రి కనబడ్డ తెలుగు ఆయన మమ్మల్ని చూసి “గుడ్ మార్నింగ్” అని తలవూచి తన ఫలహారంలో నిమగ్నుడయ్యాడు.

3

ఖాళీగా వున్నచోట మేమిద్దరం కూర్చున్నాము. “మీరు బ్రాహ్మణులు కదా!” అన్నాడు మీనన్. వాడెలా తెలుసుకున్నాడా! అని అనుకుంటూంటే “మీరు శాకాహారి కదా? అందుకడిగాను” నా సమాధానం వినకుండానే మా వెనక నిలబడ్డ నౌకరుతో నాకు శాకాహారం, తనకు మామూలువీ ఇమ్మని చెప్పాడు. అతను వెంటనే, నాకో పళ్ళెం నిండా చక్కని జావలాటి పదార్థం, పాలూ, పంచదారా, రొట్టె, వెన్నా వగైరాలు అమర్చాడు. మీనన్ కు మరొకటేదో పెట్టాడు. ఒక్కక్షణం ఇటు వంటి వస్తువులు తినేవాడి పక్కన కూర్చుని ఆ వాసన భరిస్తూ నేను భోజనం చెయ్యవలసి వచ్చిందే అని, అదోలా అనిపించింది. ఈ సంగతి మా అమ్మకీ, నాన్నకీ తెలుస్తే వాళ్ళేమంటారా, అనీ అలోచిస్తూండగా, మీనన్ వెంటనే “కానివ్వండి త్వరగా బయటకు పోదాం,” అని హెచ్చరించాడు. మేము ఉభయులమూ మా ఫలహారం ముగించి, బయట పడ్డాము.