పుట:బారిష్టర్ పార్వతీశం.pdf/149

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

148

బారిష్టరు పార్వతీశం

చెప్పక తప్పదు, ఏదయినా, కొత్త పద్ధతులు కనపడ్డప్పుడు వాటి సంగతి సందర్భాలు, మంచి చెడ్డలూ, ఉపయోగాలూ, ఇట్టే ఊహించుకుని ఉపయోగించ గలిగేవాళ్ళు తప్ప, తక్కిన వాళ్ళకు అనగా - సామాన్యులకు ఇదో పరీక్షా సమయమే అవుతుంది. చాలా ఇబ్బంది పడతారు.

ఇంకొక్క సంగతి ఇక్కడ చెప్పాలి. నేను ముందు నా గదిలోకి వెళ్ళి తువ్వాలు అదీ తెచ్చుకోవాలనుకున్నాను. ఇంతలోకే ఎదురుగుండా వున్న చాకలి తెచ్చిన తువ్వాలుమడత, సబ్బు, కనబడితే ఇవెందుకున్నాయి ఇక్కడ? మన కోసమేనా? నాకోసమే అయితే, నా ఒక్కడికే యీ మర్యాద చూపించారా? లేక కొత్తగా వచ్చిన ప్రతి వాళ్ళకూ తలొక తువ్వాలూ వాళ్ళే ఇస్తుంటారా? అనే సందేహం కలక్కపోలేదు. అయినా, మల్లె పువ్వులా ఉన్న ఆ తవ్వాలు చూచి విడవబుద్ధి కాలేదు. ముందు ఉపయోగించుకొంటే నా సందేహం తరవాత తీర్చుకోవచ్చు ననుకున్నాను. గదిలోకి వచ్చిన తరువాత కూడా ప్రతిచోటా పరుపులూ, దిండు, దుప్పటూ అన్ని వాళ్లే అందించడం నా పక్క వేసుకోవలసిన అవసరం లేకపోవడం స్ఫురణకు వచ్చింది.

ఇంతలోనే తలుపు మీద ఎవరో కొట్టిన శబ్దం అయింది. తలుపు తీశాను ఇంతక్రితం వచ్చిన నౌఖరే ఒక పెద్దపళ్ళెంలో టీ, కొన్ని రొట్టె ముక్కలు, వెన్న, పంచదార, పాలు వగైరా తీసుకువచ్చి బల్లమీద పెట్టి నిశ్శబ్దంగా నిష్క్రమించాడు, ఏమిటీ మర్యాద? ఈ రాజలాంఛనాలు? అనుకుంటూ ఫలహారం చేసి ఇకనేమిటి చెయ్యడము, ఎక్కడికి వెళ్ళడము, ఎవరినీ అడిగి తెలుసుకోవడము, అని ఆలోచిస్తూ కూర్చుండగా కొంత సేపటికి రాత్రి నాకు పరిచయమైన మీనన్ అనే పెద్దమనిషి నెమ్మదిగా పై నుంచి తలుపు కొట్టి నేను తలుపు తియ్యగానే, నవ్వుతూ లోపలకువచ్చి “గుడ్ మార్నింగ్ సర్, రాత్రి సుఖంగా నిద్రపోయారా! పొద్దున్న టీ వగైరా అందినాయా?” నేను సమాధానం చెప్పకుండటానే అదిగో అన్నీ అయినట్టున్నాయే!” అన్నాడు బల్లమీద వున్న టీ కప్పు వగైరా సామగ్రి చూచి.

నన్నొకసారి వూళ్ళోకి తీసుకు వెళ్ళి ఊరు చూపిస్తారా! అని అడుగుదామనుకుంటూ వుంటే తనే “మీరీ వేళ ఉంటారు కదా ఇక్కడ? ఏం చేస్తారు? మీరెక్కడికేనా వెళ్ళవలె ననుకుంటున్నారా! లేకపోతే, నాతోవస్తే ఒక్క సారి ఊళ్ళో తిప్పి తీసుకువస్తాను. కొంత ఉత్సాహంగా ఉంటుంది మీకు” అన్నాడు.