పుట:బారిష్టర్ పార్వతీశం.pdf/148

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

మొక్కపాటి నరసింహశాస్త్రి

147

కునుకు పట్టింది. మరో గంటవరకూ మెలకువ రాలేదు.

అప్పుడు లేచి తొందరగా ముఖం కడుక్కుందాం అనుకుంటే ఎక్కడికి వెళ్ళాలో తెలియలేదు. తలుపుతీసి చూస్తే, బయట ఎవరూ కనబడ లేదు, మళ్ళీ లోపలకు వెళ్ళి ఎలాగా అని ఆలోచిస్తుంటే గోడమీద ఒక చోట “Press Button - servant” అని ఉన్నది. ఇదేమిటో చూద్దామని వాళ్ళు వ్రాసినట్టుగానే ఆ బొత్తాము నొక్కాను. ఉత్తరక్షణములో గాలిలో నుంచి వచ్చినట్లు ఒక మనిషి తలుపు తీసుకుని లోపలకు వచ్చాడు. పొడి వేషం, నిలబడ్డ ఠీవి అన్నీ చూస్తూ వీడెవడేనా పెద్ద ఉద్యోగా? అనుకున్నాను. వాడి కేసి తెల్లబోయి చూస్తుంటే వాడే కొంచెం ముందుకు శిరస్సు వంచి చిరునవ్వు నవ్వుతూ “గుడ్ మార్నింగ్ సర్, హేడ్ సౌండ్ స్లీవ్?” అన్నాడు. తరువాత ఆరి వాడిల్లు బంగారంగాను అందులోనూ పెద్ద ఉద్యోగిలా వేషం వేసుకొని కూడాను, అనుకుని ఆశ్చర్యంతో ఏమి చెప్పాలో! అని ఆలోచిస్తూంటే, మళ్ళీ వాడే “వాట్ కేనై డూ ఫర్ యూ సర్” అన్నాడు. అప్పటికి నా మందబుద్ధికి వాడు నౌకరు కాబోలు అని తోచింది. ఆ గోడమీద కూడా “ప్రెస్ బయన్ - సర్వెంట్ అన్న వ్రాత” జ్ఞాపకం వచ్చింది.

అప్పుడు నేనూ దర్జాగా లేచి నుంచుని - వాళ్ళ దేశాచారంగదా, అనీ కరచాలనానికి చెయ్యి జాపాను. వాడు నవ్వుకుంటూ, “థాంక్ యూ సార్" అని నా చెయ్యి ముట్టీ ముట్టనట్టు అందుకుని విడిచి పెట్టాడు. 'I want to - Lavatory where, అన్నాను. “Oh this way sir” అని రాజుముందు నౌఖరులా నడుస్తూ ప్రక్కనున్న గదికి దారితీశాడు. తలుపు తీసి “you can wash - here sir" అని గోడనున్న ఒక పింగాణీ పళ్ళెం, అందులోకి వున్న కుళాయీ, చూపించాడు. ఓ పెద్ద పింగాణీ తొట్టి చూపించి, "you can have your bath here sir - hot or cold" అని అందులోకి ఉన్న రెండు కుళాయిలూ, ఒక్కమాటు తిప్పి చూపించాడు. ఒకదాంట్లో నుంచి పొగలు చిమ్ముతూ వేడినీళ్ళూ, రెండో దాంట్లోనుంచి జివ్వుమనే చల్లని నీళ్ళూ వచ్చాయి. తరువాతను పక్కనున్న ఇంకొక గోడను చూపించి “Meet you later sir” అనీ చక్కాపోయాడు. ఏది చూచినా అంతా వింతగానే కనపడింది. మన దేశానికీ, ఈ దేశానికీ ఏ విషయములోనూ సాపత్యము కనబడలేదు. ఆ గదిలో నా కాలకృత్యాలు తీర్చుకోవడానికి ఎంత సేపు పట్టిందో, ఎలా తెముల్చుకుని బయటపడ్డానో, చెప్పుకుంటూ పోతే, చాలా సేపు పట్టడం, కొంచెం విసుగుదలగా ఉండడం తప్ప మరేమీ ప్రయోజనం ఉండదుగదా! కానీ, ఒక్క మాట మట్టుకు