పుట:బారిష్టర్ పార్వతీశం.pdf/147

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

146

బారిష్టరు పార్వతీశం

పాయాలన్నీ ఏర్పాటుచేసి “గుడ్ నైట్ సర్” సౌండ్ స్లీప్ అని చెప్పి చక్కాపోయాడు.

నా సామాను అదివరకే గదిలోకి వచ్చివుంది. నేను మంచం మీద కూర్చుని కోటు తీసేసి, నెమ్మదిగా బూట్లు, మేజోళ్లు విప్పుకుంటూంటే, అప్పుడు హటాత్తుగా భోజనం ముందు కాళ్ళూ, చేతులూ కడుక్కోలేదన్న విషయం స్ఫురణకు వచ్చింది. ఈ దేశంలో ఉన్నప్పుడు ఆచారం పాటించవలసిన అవసరం ఉండదు కాబోలనుకున్నాను. కాళ్ళూ చేతులూ కడుక్కోకుండా “ఆ మాల గుడ్డలతో , తింటావా ఏమిట్రా?” అన్న మా అమ్మ మందలింపులు జ్ఞాపకానికి వచ్చాయి. నా షరాయి కూడా విడిచి పంచెకట్టుకుని మంచం మీద వెన్ను వాల్చాను. ఇంక భవిష్యత్తేమిటి? అని అనుకుంటూ ఉన్న ఉత్తర క్షణములోనే నిద్రాదేవి నన్నావహించింది.

ఇంటి దగ్గర అలవాటు చొప్పున ఉదయాన్నే అనగా, ఆరుగంటల లోపుననే మెలకువ వచ్చింది. లేచి కిటికీ తెర తొలగించి, గాజుతలుపులలో నుంచి బయటికి చూస్తే అంతా అంధకారంగా ఉంది. ఈ వసతి గృహంలో కూడా సంచలనము అట్టే ఉన్నట్టు కనపడలేదు.

ఈ మేడలూ, ఇక్కడ కట్టుబడి, ప్రతి చోటా యి కూర్చీలూ, సోఫాలూ, నడవడానికి నేలమీద తీవాసీలూ, అన్నీ చూస్తుంటే, చాలా ఆశ్చర్యమని పించింది. నేను పుట్టిన తరువాత ఇన్ని సంవత్సరాలలోనూ, ఎక్కడా ఇటువంటివి చూడలేదు. ప్రతి తలుపుకీ, కిటికీలకూ కూడా అందమైన బోలెడంత ఖరీదై న తెరలు కూడాను.

ఎందుకో, వాటి ఉపయోగ మేమిటో నాకేమీ అర్థం కాలేదు. హాయిగా గాలి చొరకుండా, ఊపిరాడకుండా ఇంత బందోబస్తు ఎందుకో ఊహించ లేక పోతున్నాను. తరువాత ఫ్రాన్సులోనూ, ఇక్కడ కూడా ఇళ్ళకూ, షాపులకూ, అన్నిటికీ కూడా అద్దపు తలుపులే. వాళ్ళకిక్కడ దొంగల భయము వుండదు కాబోలు. తమాషాకు ఇళ్ళమీద రాళ్ళు విసిరే అల్లరిపిల్లలు ఉండరు కాబోలు ననుకున్నాను. ఇలా ఆలోచిస్తూ, మళ్ళీ కాసేపు మంచం మీద పడుకున్నాను. ఇంకా ఇంత చీకటేమిటి? తెల్లవారక పోవడము ఏమిటి? సూర్యుడేమన్నా లేవడం మరచిపోయాడా? ఇక్కడ జనం అంతా లేవడం ఎప్పడు? మొహాలు కడుక్కోవడం, వగైరా నిత్యకృత్యాలన్నీ ఎప్పుడు? వాళ్ళ పని పాటలు చూచుకోవడం ఎప్పుడు? ఆడా, మగా కూడా బారెడు ప్రొద్దెక్కిన తరువాత లేస్తే వంటా వార్పు ఎప్పడూ? అనుకుంటూ అలోచిస్తూంటే, మళ్ళీ ఓ మబ్బుతెర వచ్చింది.