పుట:బారిష్టర్ పార్వతీశం.pdf/145

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

144

బారిష్టరు పార్వతీశం

కులైనట్లూ, నేనో పల్లెటూరి బచ్చా నైనట్లూ! ఒక్కరూ నా దగ్గరకు రాలేదు. ఒక్కరూ నన్ను పలకరించలేదు. ఏమిటీ వాళ్ళవింత ప్రవర్తన, కొత్తవాడు కనపడటంతోటే, మీదే వూరు ఎందాక వెడతారు. ఏం పని మీద వెడుతున్నారు. పొద్దు పోయినట్టుంది. మీరిక్కడ భోంచేసి వెళ్ళండి అంటూ ఏదో ఆ కొత్త మనిషిని పలకరించి, పరిచయం చేసుకొని, అతని కేమీ ఇబ్బందిలేకుండా పంపించడం మన సంప్రదాయం కదా. ఇదే మీటి? వీళ్లందరికీ ఒక్క మాటు వాగ్బంధనం అయినట్లు. ఒక్కడూ మాట్లాడడేమీ? పలుకరిస్తే ముత్యాలు రాలిపోతాయా? పరాయి మనిషితో మాట్లాడితేనే, గౌరవ భంగమని. నేనేమైనా తమరిని అడుగుతానా? ఏ సహాయమేనా అర్థిస్తానేమోనని భయమా? ఏమిటో నా కంతా వింతగా వుంది.

ఇంతలో నన్ను లోపలకు తీసుకు వచ్చినమనిషి. అక్కడ బల్ల పై సామానులు కొన్ని తప్పించి, ఖాళీ చేసి నన్ను దయచేసి అక్కడ కూర్చీ మీద కూర్చోమన్నాడు. “తమ కేం కావాలి?” అని అడిగాడు. ఇంతలో, అక్కడ వున్న సమూహంలో ఒక పెద్దమనిషి నామీద దయదలిచి కాబోలు నెమ్మదిగా నా దగ్గరికి వచ్చి నా పక్కన కూర్చుని “మీరు ఎక్కడనించి వచ్చారు? ఈ వూరు ఎప్పుడు వచ్చారు?” అన్నాడు. “నేను మద్రాసులో గోదావరిజిల్లా నుంచి వచ్చాను. నేను తెలుగువాడిని” ఆ మాటలువిని అక్కడ సమూహంలో వున్న మరొకతన్ని పిలిచి, మీ జిల్లా నుంచి వచ్చాడయ్యా ఈయన పాపం అతనికేం కావాలో కనుక్కుంటావా? “అన్నాడు. నేనా యన ఎవరో ఎరుగను. ఎప్పుడూ చూడలేదు. నాకెవరూ పరిచయమూ చేయలేదు. నేనెలా మాట్లాడను.” అన్నాడు. నా పక్కనున్న పెద్దమనిషీ నవ్వుకుని “అవును నిజమే సుమా - నాకు ఎవ్వరూ పరిచయం చెయ్యకపోయినా, నేను మరిచిపోయి మాట్లాడేస్తున్నాను. అయినా పాపం ఈయనేమీ అనుకోలేదు.” అంటూండగా, అవతల పెద్దమనిషి గబుక్కున తిరిగి వెళ్ళిపోయాడు.

నా పక్కనున్న పెద్దమనిషి - అయ్యా మీరేమి తీసుకుంటారు. మీరు శాకాహారులా? మాంసాహారులా? అన్నాడు. “నేను కేవలం శాకాహారిని అన్నాను. నన్ను లోపలికి తీసుకు వచ్చి, వెనుకనే నిలబడి వున్న నౌకరుతో, నాకు శాకాహార భోజనం ఏర్పాటు చెయ్యమని చెప్పాడు. అతను కొంచెం అన్నం, కొంచం కూరలాంటిది తీసుక వచ్చి, పెట్టాడు. తరువాతను కొంత రొట్టి, వెన్న ఏదో జామ్మట అది పెట్టాడు. ఆకలిమీద ఉన్నాను గనుకను,